తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తప్పదా?
కీలకమైన మహిళా లీడర్ విజయశాంతి పార్టీ మార్పు తథ్యమా? ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో చర్చకు కారణం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, టీపీసీసీసీ చైర్పర్సన్ విజయశాంతి అలియాస్ రాములమ్మ త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. తెలంగాణపై ఫోకస్ చేసిన కమలం పార్టీ సీనియర్ నేతలను తనవైపు తిప్పుకుంటోంది.. అందులో భాగంగా కమలనాధులు రాములమ్మతో భేటీ అయ్యారట. దసరా రోజు ఆమె బీజేపీలో తీర్ధం తీసుకుంటారు అని తెలుస్తోంది.
ఒకప్పటి తమ పార్టీ నేత కావడం, స్టార్డమ్ ఉన్న నేత కావడంతో ఆమెను పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ ఎప్పట్నుంచో విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. రానున్న హుజూర్ నగర్ ఉపఎన్నికల్లోనూ, అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె సేవలు వినియోగించుకోవాలనే భావనలో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ కంటే ఇప్పుడు బీజేపీ దూసుకుపోతోంది.. అందుకే ఆమె బీజేపీలోకి వెళితే రాజకీయంగా ఫ్యూచర్ ఉంటుంది అని ఆలోచిస్తున్నారట.
గతంలో ఈ వార్తలను విజయశాంతి ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని.. తానంటే గిట్టనివాళ్లు తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే తాజాగా వస్తున్న ఈ పుకార్లపై మాత్రం ఇంతవరకూ రాములమ్మ స్పందించిన దాఖలాల్లేవ్. దీంతో బీజేపీలో చేరికకు ఆమె సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. అయితే ఆమె మాత్రమే వెళతారా మరికొందరిని చేర్చుకునే దిశగా వెళతారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.