ఏపీలో మందుబాబులకు భారీ షాక్. మద్యం ధరలను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయివేటు మద్యం దుకాణాలను రద్దు చేసిన ప్రభుత్వం మద్యం అమ్మకాలకు నిర్ణీత వేళలను ప్రకటించింది. ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే సమయంలో బార్ల బార్ల సమయ వేళల్ని కుదించాలని నిర్ణయించింది.
ఇప్పటి వరకు బార్లకు రాత్రి 11 గంటల వరకు అమ్మకాలు చేస్తున్నారు. వీటి పైన అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. దశల వారీ మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో కొత్త మద్య విధానం నేటి నుండి అమల్లోకి వచ్చింది. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా అమ్మకాలు సాగనున్నాయి.
మద్యం దుకాణాలు ఇక ఇప్పటికే ప్రభుత్వం పరిధిలోకి వెళ్లటంతో అమ్మకాల సమయాలను కుదించారు. అందులో భాగంగా నేటి నుండి ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతాయి. తొలుత ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దుకాణాలు తెరవాలని నిర్ణయించారు. అయితే వాటిని సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న 4,380 మద్యం దుకాణాలను 20 శాతం మేర తగ్గించారు. ప్రభుత్వ పరిధిలో ఇక నుండి 3,500 దుకాణాలు మాత్రమే నడవనున్నాయి. పర్మిట్ రూమ్ లను రద్దు చేసారు. జూన్ నుండి ఇప్పటి వరకు 15 శాతం మద్యం అమ్మకాలు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.
మద్యం దుకాణాలను ప్రయివేటు వ్యక్తుల నుండి తప్పించి తమ అధీనంలోకి తీసుకున్న ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మద్యం దుకాణాల అమ్మకాల వేళలను కుదించిన ప్రభుత్వం, ఇక బార్ల విషయంలోనూ కీలక చర్చలు చేస్తోంది. అందులో భాగంగా బార్ల వేళల్లోనూ మార్పులు చేస్తోంది. రాష్ట్రంలో 880 బార్లున్నాయి. మద్యం షాపుల వేళల మాదిరిగానే బార్ల సమయ వేళల్ని కుదించనున్నారు. ప్రస్తుతం బార్లలో ఉ.10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఫుడ్ సర్వింగ్ పేరిట అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. వీటిపైనా నేడు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.