బిగ్ బాస్-3 రియాల్టీ షో ఆసక్తికరంగా సాగుతోంది. అయితే తాజాగా దెయ్యం టాస్క్ లో తనను వరస్ట్ పెర్ఫార్మర్ (పరమచెత్త పోటీదారు)గా బిగ్ బాస్ పేర్కొనడం పట్ల పునర్నవి మనస్తాపానికి గురైంది. పునర్నవితో పాటు శ్రీముఖి, మహేశ్ విట్టాలను కూడా బిగ్ బాస్ పరమచెత్త పోటీదారులుగా అభివర్ణించడమే కాకుండా, వారికి షూ పాలిష్ టాస్క్ ఇచ్చాడు. శ్రీముఖి వెంటనే టాస్క్ ప్రారంభించగా, మహేశ్ విట్టా కాసేపు మొండికేసి, నేను షూ క్లీన్ చేయడమేంటి అంటూ వ్యాఖ్యలు చేశాడు.
అయితే ఇతర ఇంటి సభ్యుల ఒత్తిడికి తలొగ్గి తాను కూడా టాస్క్ లో జాయిన్ అయ్యాడు. పునర్నవి మాత్రం ఎవరు ఎంత చెప్పినా ససేమిరా అంటూ ఉండడం గత ఎపిసోడ్ లో దర్శనమిచ్చింది. తాజా ఎపిసోడ్ కు సంబంధించి లేటెస్ట్ గా ప్రోమో రిలీజ్ కాగా, అందులో పునర్నవి కూడా షూ పాలిష్ చేస్తుండడం కనిపించింది.
ఆమె తనకు తోచిన రీతిలో షూ పాలిష్ చేస్తుండగా, బాబా భాస్కర్ తనదైన శైలిలో రెచ్చగొట్టేలా మాట్లాడుతుండగా, నీకుంటుంది తర్వాత అంటూ పునర్నవి బదులివ్వడం కూడా ప్రోమోలో చూపించారు. ‘నువ్వు మామూలోడివి కాదు బిగ్ బాస్’ అంటూ పునర్నవి ఇచ్చిన స్టేట్ మెంట్ తో ప్రోమో ముగిసింది.