తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం.. తమ నిరసనన, ఆవేదనను పాలకులకు ని వేదించ డం కోసం ఎన్నికల బరిలోకి దిగడం ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం.. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి పెద్ద సంఖ్యలో పసుపు రైతులు నామినేషన్లు వేసి, అధికార పార్టీకి చుక్కలు చూపించిన విషయం విదితమే.. తాజాగా అలాంటి మరో ఘటనే హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో చోటు చేసుకుంది.
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక నామినేషన్లకు చివరి రోజైన సోమవారం లక్ష్మీ నర్సమ్మ అనే 85 ఏళ్ల వృద్ధురాలు నామినేషన్ దాఖలు చేసి, అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి గల కారణాలు, ఎదుర్కుంటున్న సమస్యలపై ఆమె ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో పలు ఆసక్తికర అంశాలను ఆమె వెల్లడించారు. 85 ఏళ్ల వయసులో గెలుస్తాననో లేక గెలవాలనో ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. ప్రచారం చేసే ఉద్దేశం కూడా తనకు లేదని తెలిపారు.
అయితే పోటీ చేయడానికి దారి తీసిన పరిస్థితులను, తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ప్రభుత్వానికి, ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతోనే ఎన్నికల బరిలోకి దిగినట్లు ఆమె పేర్కొన్నారు. తమది సూర్యాపేట జిల్లా అని, అక్కడ తమ కుటుంబానికి ఎంతో విలువైన భూమి ఉందని.. కానీ తాను, తన పిల్లలు పేదరికంలోనే మగ్గుతున్నామని తెలిపారు లక్ష్మీ నర్సమ్మ. భూమాఫియాతో చేతులు కలిపి, అధికారులకు తమ భూమిని తక్కువ ధరకు అమ్మాలని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
ఈ క్రమంలోనే తమ కుమారులపై దాడి కూడా చేశారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మీరు కూడా దాడి చేయండి అని సలహా ఇచ్చారన్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు కలెక్టర్, డీజీపీ, ఎస్పీ స్థాయి అధికారులతో పాటు తహశీల్దార్‌కు కూడా ఫిర్యాదు చేశామని.. ఫలితం లేదని వాపోయారు. తనకు పసుపు కుంకుమల కింద ఇచ్చిన భూమిని కూడా కబ్జా చేశారని లక్ష్మీనర్సమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు లక్ష్మీనర్సమ్మ పేర్కొన్నారు.