పదోన్నతులు లేవు, ఎవరూ పిల్లనివ్వడం లేదు అందుకే, ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా.. అంటూ ఓ కానిస్టేబుల్ నగర కమిషనర్‌కు రాసిన లేఖ ఇపుడు వైరల్‌గా మారింది.
24 గంటలు పని, విరామం లేని విధి నిర్వహణ, వేళాపాలాలేని డ్యూటీలు వెరసి కానిస్టేబుల్ ఉద్యోగమంటేనే విరక్తి కలిగించేలా చేసాయి. చార్మినార్ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న సిద్ధాంతి ప్రతాప్ ఆవేదనకు అతని రాజీనామా లేఖ అద్దం పడుతోంది.
ఎన్నో ఆశలు, ఆశయాలతో తాను 2016లో డిపార్ట్‌మెంటులో చేరానని, పలుమార్లు విధినిర్వహణలో ఉన్నతాధికారుల చేత ప్రశంసలు కూడా అందుకున్నానని గుర్తుచేసుకున్నాడు. కానీ, కొంతకాలంగా విధినిర్వహణలో ఏదో తెలియని అసంతృప్తి, ఆందోళన వెంటాడుతున్నాయన్నాడు. తన సీనియర్లు 30-40 ఏళ్లుగా పనిచేస్తున్నా.. కానిస్టేబుల్‌గానే రిటైర్ కావడం తనను తీవ్ర కలతకు గురిచేసిందన్నాడు.
తనకు ఇపుడు 29 ఏళ్లు వచ్చాయని, ఇటీవల పెళ్లి చూపులకు వెళితే ఓ అమ్మాయి తనను తిరస్కరించిందని వాపోయాడు. ఎందుకని ఆరా తీస్తే.. కానిస్టేబుల్ ఉద్యోమంటే 24 గంటలు చాకిరీ చేయాలని, తనతో సంతోషంగా ఉండలేనని అమ్మాయి చెప్పిందని ఆవేదన వ్యక్తం చేసాడు. ఉద్యోగంలో పదోన్నతులు, విరామం లేని విధులు, సమాజంలో చిన్నచూపు తనను తీవ్ర ఆవేదన, ఆందోళన, కలతకు గురిచేసాయని అందుకే, మనస్తాపంతో తాను ఉద్యోగానికి రాజీనా చేసా అని చెప్పాడు.