తమిళ స్టార్ హీరో సూర్య రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను హీరోనే అని చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన రంగం ఫేమ్ కేవీ ఆనంద్ దర్శకత్వంలో కప్పాన్ అనే సినిమా చేస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రం బందోబస్త్ పేరుతో విడుదల కానుంది. సెప్టెంబర్ 20న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక చెన్నైలో జరిగింది.
ఈ కార్యక్రమంలో అభిమానులని ఉద్దేశించి భవిష్యత్‌లో తన సినిమాలు విడుదల అవుతున్నప్పుడు ఎలాంటి బ్యానర్స్, కటౌట్స్ పెట్టోద్దని కోరారు సూర్య. రక్తదాన శిబిరాలు లేదంటే ఇతర సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యకలాపాల ద్వారా సానుకూల మార్పును కొనసాగించాలని అభిమానులని కోరారు సూర్య.
కొద్ది రోజుల క్రితం తమిళ నాడుకి చెందిన శుభశ్రీ అనే 23 ఏళ్ళ మహిళ తన బైక్‌పై వెళుతుండగా, ఏఐఏడీఎంకే పొలిటీషీయన్ కోసం ఏర్పాటు చేసిన బ్యానర్ తగిలి కింద పడింది. అదే సమయంలో వెనుక నుండి ట్రక్ వచ్చి ఆమెని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదం సూర్యతో పాటు చాలా మందిని కలిచి వేసింది. ఈ నేపథ్యంలోనే సూర్య తన అభిమానులకి బ్యానర్స్ కట్టవద్దని సూచనలు చేస్తున్నారు.