హుజూర్‌నగర్ ఎన్నిక వేడి అపుడే మొదలైంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగానే.. పార్టీలు అభ్యర్థులను కూడా దాదాపుగా ఖరారు చేసేశాయి. ప్రజలను ఆకర్షించేందుకు టీఆర్ఎస్ పార్టీ తన ఎత్తులు మొదలు పెట్టింది. ఎంతైనా అధికార పార్టీ కదా.. ముందుగా కీలకమైన రైతుల ఓటు బ్యాంకుపై కన్నేసింది. వారిని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగా ఉపఎన్నిక వచ్చిన గంట ల వ్యవధిలోనే శనివారం సాయంత్రానికి నియోజకవర్గంలోని రైతుబంధు పథకం నిధులను రైతుల ఖాతాల్లో వేసేసింది.
వాస్తవానికి ప్రస్తుతానికి రాష్ట్ర ఖజానా అంత ఆశాజనకంగా ఏమీ లేదు. ఆర్థిక మాంద్యం వెంటాడుతున్న నేపథ్యంలో ఈసారి 2 లక్షల కోట్ల బడ్జెట్ను ఈసారి 1.4 లక్షల కోట్ల రూపాయలకు కుదించారు. అయినా రైతుబంధుకు కోతలు ఉండవని ప్రభుత్వం చెప్పినా నిధులకు కొరత ఉన్న మాట వాస్తవం
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద అర్హులైన రైతులు మొత్తం 53 లక్షలు మంది ఉన్నారు. వీరికి మొత్తం రూ.6,480 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఇప్పటికే 33 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.3,430 కోట్లు జమ చేశారు. మరో 23 లక్షలమందికి పైగా జమ చేయాల్సి ఉంది. అందులో హుజూర్‌నగర్ నియోజకవర్గం రైతులు కూడా ఉన్నారు.
నోటిఫికేషన్ వెలువడిన దరిమిలా రైతుబంధు సారైనా ఆదుకోకపోతుందా అని టీఆర్ఎస్ ఆలోచిస్తోంది. వాస్తవానికి కేసీఆర్ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావడానికి రైతుబంధు ఎంతో దోహదపడింది. కానీ, హుజూర్‌నగర్‌లో మాత్రం విజయం గులాబీ శ్రేణులకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఉమ్మడి నల్లగొండలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో గెలిచినప్పటికీ..హుజూర్‌నగర్ గెలుపు నేటికీ వారిని ఊరిస్తూనే ఉంది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని సర్వశక్తులు ఒడ్డేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది.