హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌దే విజయమంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించారు టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ ఓ బచ్చా అంటూ వ్యాఖ్యానించారు. తండ్రి ఇచ్చిన మంత్రి పదవితో విర్రవీగుతున్నారే తప్ప అతనికి ఏం తెలియదన్నట్లుగా చురకలు అంటించారు. హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్‌దే విజయమని ధీమాతో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలను ఎందుకు కొంటున్నారని ధ్వజమెత్తారు.
హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు ఛాన్స్ లేదని తేల్చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజుర్‌నగర్ బై పోల్స్‌లో టీఆర్ఎస్ విజయం ఖాయమన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. హుజుర్‌నగర్‌లో ఏం అభివృద్ధి చేశారని విజయావకాశాలపై ఆశలు పెట్టుకున్నారని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని దోచుకోవడమే ఎజెండాగా పెట్టుకున్న కేసీఆర్ ఫ్యామిలీ.. హుజుర్‌నగర్‌కు చేసిందేమీ లేదని ఫైరయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులేంటో చెప్పాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగంతో పాటు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడమే తప్ప టీఆర్ఎస్‌కు మరో విద్య తెలియదన్నారు. లోకల్ పోలీసులతో కాకుండా కేంద్ర బలగాలతో పోలింగ్ నిర్వహిస్తే టీఆర్ఎస్ సంగతేంటో బయటపడుతుందని వ్యాఖ్యానించారు.
