in

ఒకే దేశం-ఒకే నేత: హిందీ అంశం అందుకేనా?

మోడీ రాజకీయంగా జాతీయంగా సక్సెస్ అవుతున్నారు. దౌత్యనీతి, రాయబారాల్లో విదేశాల్లోనూ విజేతగా నిలుస్తున్నారు. కానీ భారతదేశం సమాఖ్య వ్యవస్థ. అప్రతిహత అధికారాలతో ఏక నాయకత్వం బలపడితే రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయనే వాదన ఉంది. నిజమైన సమాఖ్య స్ఫూర్తికి గండి పడుతుందనే భయాందోళనలూ ఉన్నాయి.

దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అధినేత ప్రస్తుతం కేంద్రప్రభుత్వాన్ని ఎదిరించి గట్టిగా మాట్లాడగల పరిస్థితి లేదు. ఇది దీర్ఘకాలంలో నియంతృత్వానికి దారి తీస్తుందేమోననే వారూ ఉన్నారు. శాసనసభ, లోక్ సభలకు ఏకకాలంలో ఎన్నికలు పెట్టాలనే ప్రయత్నమూ ఒకే దేశం..ఒకే నేత భావన బలపడటానికి మరింత దోహదం చేస్తుందేమోననే అనుమానాలూ ఉన్నాయి. భిన్నమైన ఆలోచనలు, వ్యక్తుల అభిప్రాయాలకు తగిన మన్నన దక్కినప్పుడు ఏకపార్టీ బలపడితే పెద్దగా నష్టమేమీ లేదు. అయితే ఒకే ఆలోచనతో మొండిగా ముందుకు వెళ్లే పరిస్థితి ఏర్పడితే దేశంలోని భిన్న భాషలు, సంస్కృతుల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది.

హోం మంత్రి అమిత్ షా దేశమంతా హిందీ అంటూ నినాదం ఎత్తుకున్న సందర్భంలో తలెత్తిన ప్రకంపనలే అందుకు నిదర్శనం. ఈ విషయంలో బీజేపీ ఒక నిర్దిష్టమైన విధివిధానాలను రూపొందించుకోవాలి. దేశమంతా బీజేపీ హవా చుట్టుముట్టడంతో ఇతర రాజకీయ పక్షాలు తీవ్రమైన నిర్బంధాన్ని ఫీలవుతున్నాయి. ఈ స్థితిలో ఏ ఒక్క భావోద్వేగ అంశం దొరికినా వదులుకోవు. భాషాపరమైన, ప్రాంతీయపరమైన అంతరాలు తలెత్తే పరిస్థితికి తావివ్వకుండా మోడీ , అమిత్ షా లు జాగ్రత్త వహించాలి. లేకపోతే తామింత కాలం నిర్మించుకుంటూ వచ్చిన జాతీయ వాద భావ సమైక్య రాజకీయ సమీకరణకూ ప్రమాదమే.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

14 ఏళ్ల తర్వాత..

ఒక్క సినిమా కోసం 100 లొకేషన్లు