in

కెసిఆర్ ఇక కాస్కో .. నేనొస్తున్నా

తెలంగాణ రాజకీయంలో హుజూర్ నగర్ ఉపఎన్నిక మరోసారి అగ్గిరాజేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గ‌త డిసెంబ‌ర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే గ‌త ఏప్రిల్‌లో జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న నల్లగొండ ఎంపీ స్థానం నుంచి గెలిచి, అసెంబ్లీ సీటు వదిలేసుకున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ కూడా రిలీజ్ చేసింది. వ‌చ్చే నెల 21న ఎన్నిక జ‌రుగుతుండ‌గా… 24న కౌంటింగ్ జ‌రుగుతుంది. ఇక నోటిఫికేష‌న్ వ‌చ్చిన వెంట‌నే అధికార టీఆర్ఎస్ పార్టీ త‌మ అభ్య‌ర్థిగా గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన శానంపూడి సైదిరెడ్డిని త‌మ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది.

ఇక కాంగ్రెస్‌లో పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, రేవంత్ రెడ్డి వేర్వేరుగా ప్ర‌క‌ట‌న‌లు చేసినా ఉత్త‌మ్ భార్య‌, కోదాడ మాజీ ఎమ్మెల్యే ప‌ద్మావ‌తి అభ్య‌ర్థిత్వ‌మే ఖ‌రార‌వుతుంద‌ని అంటున్నారు. ఇదిలా ఉంటే సైదిరెడ్డి పేరు ప్ర‌క‌ట‌న‌తో టీఆర్ఎస్ రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. 2014లో ఇక్క‌డ టీఆర్ఎస్ త‌ర‌పున తెలంగాణ కోసం ఎల్బీన‌గ‌ర్ చౌర‌స్తా సాక్షిగా ప్రాణ‌త్యాగం చేసుకున్న అమ‌ర‌వీరుడు శ్రీకాంతాచారి త‌ల్లి శంక‌ర‌మ్మ‌ను కేసీఆర్ సీటు ఇచ్చారు. ఆమె ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.

ఇక 2018లో సైతం ఆమె సీటు ఆశించ‌గా… జిల్లాకే చెందిన మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి చ‌క్రం తిప్పి ఎన్నారై సైదిరెడ్డికి సీటు ఇప్పించారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న చివ‌రి వ‌ర‌కు గ‌ట్టి పోటీ ఇచ్చి 7 వేల ఓట్ల‌తో ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఏడెనిమిది నెల‌ల్లోనే ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈ ఉప ఎన్నిక‌ల్లో త‌న‌కు సీటు ఇస్తార‌ని శంక‌ర‌మ్మ ఆశ‌లు పెట్టుకుంది. అయితే నోటిఫికేష‌న్ వ‌చ్చిన వెంట‌నే కేసీఆర్ మరోసారి కూడా గత ఎన్నికల్లో ఓటమి పాలైన సైదిరెడ్డికే చాన్స్ ఇవ్వడంతో ఆమె మనస్థాపానికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శంకరమ్మ ఎలాగైనా బరిలో నిలవాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

శంక‌ర‌మ్మ‌పై బీజేపీ వ‌ల‌…

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో దిగిందని సమాచారం. శంక‌ర‌మ్మ‌ను త‌మ పార్టీలో చేర్చుకుని సీటు ఇస్తే… అటు తెలంగాణ అమ‌ర‌వీరుల కుటుంబానికి తాము న్యాయం చేశామ‌న్న భావన ప్ర‌జ‌ల్లోకి వెళుతుంద‌ని.. అదే టైంలో టీఆర్ఎస్ తెలంగాణ అమ‌ర‌వీరుడు శ్రీకాంతాచారి కుటుంబానికి అన్యాయం చేసింద‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లిన‌ట్ల‌వుతుంద‌న్న‌దే బీజేపీ స్కెచ్‌గా తెలుస్తోంది.

అదే టైంలో మ‌న‌స్థాపంతో ఉన్న శంక‌ర‌మ్మ సైతం ఎలాగైనా ఉప ఎన్నిక‌ల బ‌రిలో ఉండాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ఈ ప‌రిణామాలు క్యాష్ చేసుకునేందుకు బీజేపీ రెడీగా ఉంది. ఇక శంకరమ్మ తనకు టిక్కెట్ కావాలని అడగలేదని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పడం కూడా టీఆర్ఎస్‌ను ఇబ్బంది పెట్టే అంశంగా మారనుందని బీజేపీ అంచనా వేస్తోంది. ఏదేమైనా హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక తెలంగాణ రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తోంది.


What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

వికెట్ ఔట్ …

భర్త సెక్స్ చాట్ వ్యవహారం ట్విట్టర్లో పెట్టిన భార్య