in

నిర్మాణ లోపాలే ప్రమాదానికి కారణం…

నగరంలోని అమీర్‌పేట (మైత్రివనం) మెట్రో స్టేషన్‌ కింద ఆదివారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్‌ పైనుంచి పెచ్చులు ఊడిపడి ఓ యువతి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే…కేపీహెచ్‌బీ కాలనీలోని ఎస్‌ఆర్‌ హోమ్స్‌లో నివసించే హరికాంత్‌ రెడ్డి భార్య మౌనిక కంతాల(24) టీసీఎస్‌లో పని చేస్తున్నారు. ఆమె తన సమీప బంధువు మున్నీకి అమీర్‌పేట్‌లో హాస్టల్‌ వసతి చూసేందుకు ఆదివారం ​మధ్యాహ్నం కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్‌ వద్ద మెట్రో రైలు ఎక్కి అమీర్‌పేట్‌ స్టేషన్‌లో దిగారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మౌనికతోపాటు ఆమె బంధువు మున్నీ సారథీ స్టూడియోస్‌ వైపు మెట్రో స్టేషన్‌ మెట్లు దిగారు. భారీ వర్షం పడుతుండటతో మెట్రో స్టేషన్‌ మెట్ల మార్గం పిల్లర్‌ కింద నిరీక్షిస్తున్నారు.

అదే సమయంలో వాళ్లు నిల్చున్న పిల్లర్‌పైన ఉన్న మెట్రో స్టేషన్‌ కాంక్రీటు అంచులు తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి పెచ్చులు ఊడి మౌనిక తలపై పడ్డాయి. దీంతో బలంగా గాయాలు కావడంతో తల పగిలి తీవ్రంగా గాయపడిన మౌనిక అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో ఉన్న మౌనికను స్థానికులు,మెట్రో సిబ్బంది సమీపంలోని ప్రైమ్‌ ఆస్పత్రికి ఆటోలో తరలించారు. మార్గమధ్యంలోనే మౌనిక మృతి చెందిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఎస్సార్‌ నగర్‌ పోలీసులకు సమాచారం అందడంతో మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి స్వస్థలం మంచిర్యాల కాగా, ఆమెకు ఏడాదిన్నర క్రితమే వివాహమైందని పోలీసులు తెలిపారు.

మృతురాలు మౌనిక భర్త మాట్లాడుతూ.. ‘తన కజిన్‌ని హాస్టల్‌లో జాయిన్‌ చేద్దామని, అందుకోసం హాస్టల్‌ వెతికేందుకు మౌనిక, కజిన్‌తో కలిసి ఇవాళ మధ్యాహ్నం మెట్రోలో కేపీహెచ్‌బీ నుంచి అమీర్‌పేట వచ్చారు. అయితే వర్షం బాగా రావడంతో వాళ్లిందరూ మెట్రో స్టేషన్‌ మెట్ల వద్ద నిలబడ్డారు. ఆ సమయంలో పై నుంచి పెచ్చులు పడ్డాయి. దీంతో మౌనిక తలకు గాయమై చాలా రక్తం పోయింది. వెంటనే మా కజిన్‌, స్థానికులు సమీపంలోని ప్రైమ్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు’ అని తెలిపాడు.

ఎస్సార్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. మరోవైపు ఈ ప్రమాదంపై మెట్రో యాజమాన్యం వివరణ ఇచ్చింది. ‘యువతి తలపై పైనుంచి పెచ్చులు పడ్డాయి. పదునుగా ఉన్న ఆ పెచ్చులు పడటంతో ఆమె తలకు బలమైన గాయం అయింది. వెంటనే సమీప ఆస్పత్రికి తరలించాం. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించాం’ అని తెలిపింది.

నిర్మాణ లోపాలే ప్రమాదానికి కారణం…
మెట్రోప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మెట్రో స్టేషన్లను సైతం ప్రీకాస్ట్‌ విధానంలో నిర్మించారు. అంటే ముందుగా స్టేషన్‌కు అవసరమైన సెగ్మెంట్ల తయారీని ఉప్పల్‌,మియాపూర్‌ కాస్టింగ్‌యార్డులో సిద్ధంచేసి ఆతరవాత స్టేషన్లు నిర్మించిన చోట అమర్చారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా… పిల్లర్లు,వాటిపై ఏర్పాటుచేసిన వయాడక్ట్‌ సెగ్మెంట్ల మధ్యనున్న ఖాళీప్రదేశాన్ని సిమెంటు,ఇసుక,కాంక్రీటు మిశ్రమం(కాంక్రీటు)మిశ్రమంతో మూసివేశారు. ఇక్కడే పొరపాట్లు జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

ఈ పనులను హడావుడిగా చేపట్టడంతో మెట్రో రైలు వెళ్లే సమయంలో కలిగే ప్రకంపనలకు మధ్యభాగంలో వేసిన కాంక్రీటు మిశ్రమం పెచ్చులుగా ఊడి తరచూ కింద పడుతుందని తేల్చారు. దీంతో మెట్రో ప్రయాణీకులు,రహదారి మార్గంలో వెళ్లేవాహనదారులు,ప్రయాణీకుల పాలిట శాపంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. ఆదివారం జరిగిన సంఘటనకు సైతం ఇదే కారణమని తేల్చారు. కాగా గ్రేటర్‌సిటీలో మెట్రో ప్రాజెక్టు 2017 నవంబరు నెలలో ప్రారంభమైంది. రెండేళ్ల వ్యవధిలోనే ఇలాంటి సంఘటన జరగడం మెట్రో ప్రాజెక్టులోని డొల్లతనాన్ని బయటపడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తుండడం గమనార్హం.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

మోడీ ఈ స్థానంలో ఉన్నారంటే కారణం ఇదే

మన్మధుడు 2 : Watch Manmadhudu 2 on Netflix