in

జగన్ Vs కేంద్రం : మళ్ళీ మొదటికొచ్చిన యవ్వారం

సౌర, పవన విద్యుత్‌ పీపీఏలపై రాష్ట్ర ప్రభుత్వ వాదనను కేంద్రం తిరస్కరించింది. ఈ మేరకు కేంద్ర ఇంధన మంత్రి ఆర్కే సింగ్‌ ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ప్రధాని మోదీని కలిసినప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చిన ఫిర్యాదుకు ప్రతిస్పందనగా కేంద్ర మంత్రి ఈ లేఖ రాయడం విశేషం. ఆంధ్ర ప్రదేశ్‌లో సౌర, పవన విద్యుత్‌కు సంబంధించి గతంలో ఖరారైన ధరలు అధికంగా ఉన్నాయన్న జగన్‌ ప్రభుత్వ వాదనలో నిజం లేదని, కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రలో ఇవి తక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు.

‘పవన విద్యుత్‌ ధర 2016- 17లో మీ రాష్ట్రంలో ఒక యూనిట్‌ రూ.4.84 ఉంది. అదే సంవత్సరంలో రాజస్థాన్‌లో రూ.5.75, మహారాష్ట్రలో రూ.5.56, మధ్యప్రదేశ్‌లో రూ.4.78, గుజరాత్‌లో రూ.4.18గా ఖరారైంది. గాలి వేగం, భూమి ధర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను బట్టి.. రాష్ట్రానికీ.. రాష్ట్రానికి ధరలు మారుతుంటాయి. అలాగే సౌర విద్యుత్‌ ధర 2014లో మీ రాష్ట్రంలో ఒక యూనిట్‌ రూ.6.75 ఉంది. ఇప్పుడు ఆ ధర రూ.3కి తగ్గిందని మీ ఫిర్యాదులో పేర్కొన్నారని గుర్తు చేశారు. 

సోలార్‌ సెల్స్‌, మాడ్యూళ్లు, పరికరాల ధరలు తగ్గడం, టెక్నాలజీ మారడం వల్ల ఈ ధరలు తగ్గుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. నేటి ధరలతో గత ధరలను పోల్చిచూసి ఎక్కువగా ఉన్నాయనుకోవడం సరికాదని స్పష్టం చేశారు. పైగా సౌర, పవన విద్యుదుత్పత్తి యూనిట్లకు ఒకేసారి పెట్టుబడి పెట్టేస్తారని, థర్మల్‌ ప్లాంట్లకు ఏటా బొగ్గు తెచ్చి విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవాలని అంటూ ఈ తేడా గమనించమని హితవు చెప్పారు. 

థర్మల్‌ విద్యుత్‌ ఇప్పుడు యూనిట్‌ రూ.4.20కి దొరుకుతోందని.. దానితో పోలిస్తే సౌర, పవన విద్యుత్‌ ధరలు అధికంగా ఉన్నాయని.. వాటిని తగ్గించాలన్న వాదన సరికాదు. బొగ్గు ధరలు, ఉద్యోగుల జీత భత్యాలు తదితర కారణాల వల్ల థర్మల్‌ విద్యుత్‌ ధర ప్రతి పదేళ్లకు రెట్టింపవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పాతికేళ్ల తర్వాత యూనిట్‌ రూ.20-22కి పెరగొచ్చని, అయితే పీపీఏల కారణంగా సౌర, పవన విద్యుత్‌ ధరలు ఇప్పుడు ఉన్నట్లుగా యూనిట్‌ రూ.4.84గానే ఉంటాయని తెలిపారు. 

జర్మనీ, చైనా వంటి దేశాల్లో కూడా దీర్ఘకాల పీపీఏలను కుదుర్చుకుని ఆ ధరనే ఆ ఒప్పంద కాలం మొత్తానికీ చెల్లిస్తారని కేంద్ర మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ డిస్కంల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న మాట వాస్తవమే అని, అయితే దానికి దానికి సౌర, పవన విద్యుత్‌ ధరలు కారణం కాదని స్పష్టం చేశారు. “మీ డిస్కంలు ఉదయ్‌ పథకంలో చేరాయి. వాటి ప్రకారం.. 2016-17లో 3.6 శాతం, 17-18, 18-19ల్లో ఐదు శాతం చొప్పున కరెంటు చార్జీలు పెంచాలి. కానీ పైసా కూడా పెంచలేదు” అని పేర్కొన్నారు.

నిబంధనల ప్రకారం చార్జీలను హేతుబద్ధం చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. “పవన విద్యుత్‌ రంగంలో మూడు కంపెనీలు గ్రీన్‌ కో, రెన్యూ, మైత్రాల వద్దనే అత్యధిక భాగం యూనిట్లు ఉన్నాయని మీరు (జగన్‌) ఫిర్యాదు చేశారు. దానిపై ఆ మూడు కంపెనీలు సమాధానం పంపాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందే తమకు ఎక్కువ అనుమతులు ఉన్నాయని, ఆ తర్వాత ఇతర సంస్థల యూనిట్ల కొనుగోలు ద్వారా సామర్థ్యాన్ని పెంచుకున్నామని.. ఆ సంస్థలు తెలిపాయి” అని వివరించారు.

ఉదాహరణకు.. గ్రీన్‌ కో కంపెనీకి 2014కి ముందు 253 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి అనుమతులు వచ్చాయి. 2014 తర్వాత కేవలం 50 మెగావాట్లకే అనుమతిచ్చారు. అది ఇతర సంస్థలను కొనుగోలుచేసి మరో 730 మెగావాట్ల మేర సామర్థ్యం పెంచుకుంది. ఏదైనా ఒక నిర్దిష్ట వ్యవహారంలో అవకతవకలు చోటు చేసుకుంటే చర్య తీసుకోవడానికి రాష్ట్రప్రభుత్వానికి ఎప్పుడైనా అధికారం ఉంటుందని సింగ్ తెలిపారు. 

అయితే ఏవేవో అపోహలతో.. అనుమానాలతో మొత్తం పీపీఏల పునఃసమీక్ష చేపట్టవద్దని హితవు చెప్పారు.  ఇది ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు తప్పుడు సంకేతాలు పంపిస్తుందని హెచ్చరించారు. ఈ దేశంలో ఒకసారి కుదుర్చుకున్న ఒప్పందాలకు విలువ లేదన్న అభిప్రాయం వ్యాపిస్తే పెట్టుబడులు రావు. పునరుత్పాదక విద్యుదుత్పత్తిని భారీగా పెంచాలన్న లక్ష్యానికి విఘాతం కలుగుతుందని వారించారు. 

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

మీరు రండి, మై హోనా

సెక్స్‌ మాఫియా కథాంశంలో నయనతార