in

విజయ్ సాధు: చంపేద్దాం‌ లేదా చచ్చిపోదాం..( విజయ రెడ్డి హత్య )

చంపేద్దాం‌ లేదా చచ్చిపోదాం..

ఇదే కదా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్.. లంచం ఇవ్వనందుకే “అబ్దుల్లాపూర్ మెట్” MRO విజయారెడ్డి పై పెట్రోల్ పోసి తగలబెట్టాడని నిందితుడు, మృతుడు కూర సురేష్ భార్య ఆరోపిస్తోంది. అసలు మా అబ్బాయికి మతిస్థిమితం‌ లేదు, మా పొలం గురించి వాడికి తెలియదని తల్లితండ్రులు చెప్పారు. ఇందులో నిజమెంతో,అబద్ధమెంతో తెలియదు కానీ, వేధింపులు నిజమో కాదో చెప్పేందుకు సురేష్ లేడు,ఇదంతా అబద్ధమని వాదించేందుకు విజయారెడ్డి కూడా లేదు. వీళ్లిద్దరూ కాకున్నా ఎవరైనా సాక్ష్యాలతో సహా ముందుకు వస్తారా అనుకుంటే దానిమీద కూడా క్లారిటీ లేదు.

తప్పేదో ఒప్పేదో కాలమే తేల్చుతుంది కానీ ….. విజయారెడ్డి వ్యతిరేకుల సంఘం, సురేష్ అభిమాన సంఘం ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. అవినీతిని నిర్మూలన బ్యాచ్ సోషల్ మీడియాలో ఉన్మాదాన్ని పెంచి పోషిస్తోంది. లంచం అడిగిన వాళ్లను నరికేయాలి, పెట్రోల్ పోసి తగలబెట్టాలని పోస్టులు పెడుతోంది, నిజమైన భారతీయుడు సురేష్ అంటూ ఊరూరా Flexiలు కడుతోంది. ఇదంతా సమసమాజం,అవినీతి రహిత ప్రపంచం మీద ప్రేమ ఏమాత్రం కాదు..Identity Crisis Syndromeతో బాధపడే వాళ్లే ఇలా చేస్తారు. ఇలా ఉసిగొల్పి ఊరు తగలబడుతుంటే చలి కాచుకుంటారు. చంపాల్సిందే,చంపేయాల్సిందేనంటూ నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తూ భావోద్వేగాలను రెచ్చగొడుతుంటారు. నేరం చేసేందుకు ప్రేరేపించటం నేరం చేయటం‌ కన్నా అతిపెద్ద నేరం. బడా బడా క్రిమినల్స్ కన్నా కూడా వీళ్లే అత్యంత ప్రమాదకరం.

అత్యాచారాలు ఆగిపోవాలంటే నిందితుడికి ఉరిశిక్ష వేయాలి లేదా అప్పటికప్పుడే చంపేయాలని ఊగిపోయే బ్యాచ్ తర్వాత పుట్టినోళ్లే వీళ్లంతా…. కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటే విజయారెడ్డిని చంపడం ఎంత అనాలోచిత చర్యో, ఇంకొందరిని కూడా అలాగే చంపాలి‌ అనే వాదనను సమర్ధించటం ఎంతటి తెలివితక్కువ తనమో తెలుస్తుంది.

01.లంచం అడిగింది,పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా వేధించిందనే సాకుతో విజయారెడ్డిని చంపేస్తే …. సమస్య పరిష్కారం‌ అయిపోయిందా..?
02. విజయారెడ్డిని చంపేస్తే సురేష్ కడిగిన‌ ముత్యంలా బయటపడతాడా..?
03. విజయారెడ్డిని చంపేస్తే ఆ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చేస్తాయా…?
04. ఇప్పుడు సురేష్ కూడా చనిపోయాడు, అతని కుటుంబానికి దిక్కెవరు…?
05. కాపాడాలని డ్రైవర్ గుర్నాథం వచ్చాడు, అతడు కూడా చనిపోయాడు.. అతని కుటుంబాన్ని ఇప్పుడెవరు చూసుకుంటారు..?
06. పెట్రోల్ పోసి తగలబెట్టినంత మాత్రాన అవినీతి అంతా కనుమరుగవుతుందా..?
07. విజయారెడ్డిని హత్య చేసినంత మాత్రాన వేరేవరు లంచం,అడగరా తీసుకోరా…?
08. తీసుకుంటారు..ఎందుకు తీసుకోరు , కాకుంటే భయం పుడుతుంది,పుట్టించాలి అనే బెదిరింపు ధోరణి అవినీతి నిర్మూలనకు దోహదపడుతుందా..?
09. సరే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ లంచం తీసుకోవటం లేదా..? ఎవరూ పట్టుబడలేదా…? చంపటమే సరైన పరిష్కారం అయితే వీళ్లెందుకు మారలేదు..?
10. బెదిరిస్తూ పోతే ఎవరు మారతారు,అలా వచ్చే తాత్కాలిక మార్పు ఒక మార్పేనా…?
11. MRO విజయారెడ్డి,నిందితుడు సురేష్, డ్రైవర్ గుర్నాధం కుటుంబాలు అనుభవించే కన్నీటికోతకు ఎవరు బాధ్యత వహిస్తారు. ఆ పిల్లలకు సమాధానం ఎవరు చెబుతారు..?

దాదాపు ప్రభుత్వ శాఖలు అన్నీ అవినీతిలో కూరుకుపోయాయనే విషయం తెల్సిందే..అవినీతి ఎక్కడున్నా సరే, ఏ రూపంలో ఉన్నా సరే నిర్మూలించాల్సిందే. అంతం చేసి తీరాల్సిందే. కానీ ఇలా కాదు…ఇలా మాత్రం కాదు. పెట్రోల్ పోసి తగలబెట్టో, వేట కత్తులతో నరికి చంపో, చంపేస్తామని బ్లాక్ మెయిల్ చేసో కాదు. వ్యక్తులను హత్య చేస్తే వ్యవస్థ మారిపోతుందనుకోవటం మూర్ఖత్వం కాక మరేమవుతుంది..? భారతీయుడు,అపరిచితుడు వంటి సినిమాలు చూసి రీల్ లైఫ్ ను,రియల్ లైఫ్ లో అనుకరించాలని చూస్తే నష్టపోయేది మనం మాత్రమే కాదు మన కుటుంబాలు కూడా. అవినీతి,అక్రమాలపై అలుపెరగని పోరాటం చేయాలి. ఓడిపోయామని తెల్సిన ప్రతీసారీ మరింత రెట్టింపు వేగంతో చేయాలి.Never Forget One Thing చేయాల్సింది రాజీ లేని పోరాటమే కానీ హత్యలు కాదు…హత్యా రాజకీయాలు కానే కాదు….

Vijay Sadhu : Editor-in-Chief at Reporter Voice

What do you think?

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings

ప్రొడ్యూసర్ ని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి

ఆర్టీసీ చలో ట్యాంక్ బండ్ : పోలీసులపై రాళ్లు విసిరిన కార్మికులు