పసి ప్రాణం మింగేసిన బోరు బావి, ఎవరిది బాధ్యత?

మెదక్ జిల్లా పాపన్న పేట్ మండలం పోడ్చన్ పల్లి లో ఈ రోజే తీసిన బోర్ బావిలో మంగలి బిక్షపతి కి చెందిన పొలంలో అతని బిడ్డ కుమారుడు గోవర్ధన్ మూడవ కుమారుడు సాయివర్థన్ తల్లిదండ్రులతో నడుస్తూ బోరు బావిలో పడ్డాడు

బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన సాయిని కాపాడలేకపోయారు

 గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో 25 అడుగుల లోతు నుంచి బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికితీశాయి.ఈ వ్యవసాయ బోర్ బావి  లోతు 120 అడుగులు. బుధవారం సాయంకాలం తాత తో కలసి ఆ దారిన వెళ్తున్నపుడు సాయి పొరపాటున బోర్ బావిలో పడిపోయాడు.

ఎప్పటిలాగే ఎన్డీఆర్ఎఫ్ టీం, లోకల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఇలా అందరు విశ్వ ప్రయత్నాలు చేసారు బాబుని కాపాడటానికి. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది.

ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. బోరు బావిలో పడిన సాయి మీద బురద, మట్టి పడి దాదాపు లోపలికి పూడ్చుకుపోయాడు. అందుకే పైనుంచి ఆక్సిజన్ పంపిన బాలుడికి అందలేదని తెలిసింది. సాయిని రక్షించేందుకు దాదాపు పది గంటలు ప్రయత్నించారు.బోర్ బావికిపక్కనే పెద్ద గోతిని తవ్వి కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, ఆక్షీజన్ అందేలోపే చనిపోయి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

అనంతరం బాబు మృతదేహాన్ని మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇలాంటి సంఘటనలు మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చూస్తున్నాం. ప్రభుత్వాలు ఎంత కఠినంగా ఉన్నా, బోరుబావులు తవ్వగానే వాటిని పూడ్చేయాలన్న మినిమమ్ సోయి ఎవ్వరికీ లేకుండా పోయింది. మన కళ్ళ ముందున్నా సరే కంప్లైంట్ ఇద్దాం అన్న అవగాహన లేదు. కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బోరు బావి తవ్వకాలు జరిగినపుడు, అవి ఎవరు తవ్వుతున్నారు, ఆయా కంపెనీలు అక్కడి లోకల్ అధికారులకు ముందుగా సమాచారం ఇవ్వడమో, లేదా బోరు బావి తవ్వించుకునే వాళ్ళు ముందుగా సమాచారం ఇస్తేనే, అధికారులు తనికీ చేసి మళ్ళీ తిరిగి వాటిని పూడ్చడం జరిగిందా లేదా అనేది ఎక్కడ కనబడటం లేదు. ఇంకెన్ని రోజులు ఇలా? ఇంకెన్ని పసి ప్రాణాలు ఇలా ?

ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎవరి బాధ్యత ఇది?

ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాల్సిన మీడియా చానళ్ళు ఇలాంటి సంఘటనలను వాళ్ళ టీఆర్పీ రేటింగులు పెంచుకోడానికి, మూడు నాలుగు రోజులు లైవ్ టెలికాస్ట్ చేసి వదిలేస్తున్నారు తప్ప ఎటువంటి ప్రయోజనం జరగట్లేదు. సంఘటన జరిగిన మరు నాడు పేపర్లలో హెడ్ లైన్ చదివి మనం మర్చిపోతున్నాం.

దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ సంఘటనలు జరగగకుండా దీనికోసమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇంకెన్నో పసి ప్రాణాలు కాపాడుకోవాలి.