కేసీఆర్ తాతా … ప్లీజ్ నాకు న్యాయం చేయండి
Timeline

కేసీఆర్ తాతా … ప్లీజ్ నాకు న్యాయం చేయండి

మోదీ తాతయ్య, కేసీఆర్ తాతయ్య తనకు న్యాయం చేయండి అంటూ మెడలో ఫ్లకార్డు వేసుకుని కరీంనగర్ జిల్లా, శంకరపట్నానికి చెందిన బాలుడు పాదయాత్ర చేపట్టడం అందర్నీ కలిచి వేస్తుంది. సిరిసిల్లకు చెందిన నాగ ప్రణీత్ అనే ఆరేళ్ల బాలుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తన గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించాడు. తన తల్లిదండ్రులు చనిపోయాక… తమకున్న ఎకరా భూమిని ఓ ప్రజాప్రతినిధి కబ్జా చేశాడని ఆరోపిస్తున్నాడు. దయచేసి తమ భూమిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం లింగంపల్లికి చెందిన కుమారస్వామి, మమతలకు నాగప్రణీత్(6) అనే కుమారుడు ఉన్నాడు. 2017లో అనారోగ్య సమస్యలతో కుమారస్వామి, మమత మరణించారు. అప్పటి నుంచి నాగప్రణీత్ ను తాతయ్య పెంచుతున్నాడు. అయితే కుమారస్వామి, మమత బతికున్నప్పుడు తమకున్న ఎకరా భూమిని ఓ వ్యక్తికి కౌలుకు ఇచ్చారు. అయితే మాజీ ప్రజాప్రతినిధి అయిన ఆ వ్యక్తి… భార్యభర్తలిద్దరూ బతికున్నంత కాలం కౌలు చెల్లించాడు. అయితే ఎప్పుడైతే ఆ దంపతులు చనిపోయారో ఆ తర్వాత, వారి ఎకరా భూమిని కూడా చేజిక్కించుకోవాలని ప్లాన్ చేసి తనకున్న పలుకుబడిని ఉపయోగించి రెవెన్యూ రికార్డుల్లో భూమిని తన పేరిట మార్పించుకున్నాడు.

దీంతో నాగప్రణీత్ తనకు న్యాయం చేయాలని తాత తో కలిసి లింగంపల్లి గ్రామం నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టాడు. ఈ సందర్భంగా… ‘కేసీఆర్ తాతయ్యా… మోదీ తాతయ్యా…’ నాకు న్యాయం చేయండని ఆ బాలుడు విజ్ఞప్తి చేశాడు. మంగళవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. మరి కేసీఆర్ తాత ఏంచేస్థాడో చూడాలి.