ఇంతకీ వ్యాక్సిన్ సప్లై చేసే సత్తా మన ప్రభుత్వం దగ్గర ఉందా ?
Timeline

ఇంతకీ వ్యాక్సిన్ సప్లై చేసే సత్తా మన ప్రభుత్వం దగ్గర ఉందా ?

కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ నుంచి అన్ లాక్ వైపు వెళ్తున్న తరుణంలో ప్రపంచంలోని పలు వైద్య, పరిశోధనా సంస్థలు కరోనావైరస్ కు వాక్సీన్ తయారీలో మూడో దశలో కొనసాగుతున్నారు. ఇందులో ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఫార్మా దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా సంస్థ‌లు క‌లిపి రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను భార‌త్ లో పూణెకు చెందిన సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) హ్యూమన్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. కాగా ఈ ఫలితాలు కూడా అశాజనకంగా వున్నాయిన తెలుస్తోంది. హ్యూమన్ ట్రయల్స్ కన్నా ముందుగానే దేశంలోని ప్రతీ ఒక్కరికీ ఈ వాక్సీన్ ను కేంద్రం ఉచితంగానే అందిస్తుందని సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అద‌ర్ పూనావాలా ప్రకటించారు.

ఇది వ్యూహాత్మకమో లేక కాకతాళీయమో తెలియదు కానీ ఆగస్టు 15న ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని నరేంద్రమోడీ కూడా అదే సందేశాన్ని దేశ ప్రజలకు వెలువరించారు. దేశంలోని ప్రతీ ఒక్కరికి కరోనా వాక్సీన్ ను ఉచితంగా ఇస్తామని అన్నారు. అయితే తాజాగా అదర్ పూనావాలా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో కేంద్రానికి ప్ర‌శ్న వేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను దేశంలోని ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేసేందుకు కేంద్రం వ‌ద్ద రూ.80వేల కోట్లు ఉన్నాయా ? అని పూనావాలా ప్ర‌శ్నించారు. ఎందుకంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్ప‌టి నుంచే వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాల‌ని, అలా చేస్తేనే వ్యాక్సిన్ వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి ఆల‌స్యం లేకుండా దేశంలోని ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు.

కాగా సీర‌మ్ ఇనిస్టిట్యూట్ కోవిడ్ వ్యాక్సిన్‌ను భార‌త్ కోసం నెల‌కు 3 కోట్ల డోసుల‌ను ఉత్ప‌త్తి చేయ‌నుంది. ఈ క్ర‌మంలో దేశం మొత్తానికి వ్యాక్సిన్‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు క‌నీసం 2 ఏళ్ల స‌మ‌యం ప‌డుతుంది. అందుక‌నే వ్యాక్సిన్ పంపిణీ కోసం రోడ్ మ్యాప్ ఉండాల‌ని పూనావాలా అన్నారు. దీంతో పూనావాలా చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. ఇందుకు కేంద్రం ఏమ‌ని స‌మాధానం ఇస్తుందా.. అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఓ వైపు రైతులు, మరోవైపు కార్మికులు తమపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు వెలువెత్తుతున్న తరుణంలో అదార్ పూనావాలా ఇలాంటి వ్యాఖ్యలతో దేశ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారా.? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి.