ఆంధ్ర ప్రదేశ్ లో ఈనెల 30వ తేదీ నుండి ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, అక్వాఫీడ్, మార్కెట్ సమాచారం, పంటల సాగు సమాచారం పొందవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా ఈ ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 10,641 గ్రామాల్లో ఈ డిజిటల్ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ సచివాలయంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
ప్రతి భరోసా కేంద్రంలోనూ ఎటిఎం లాంటి డిజిటల్ కియోస్క్ అందుబాటులో ఉంటుంది. రైతులు ఈ కియోస్క్‌ను సులభంగా ఉపయోగించవచ్చు. ఈ కియోస్క్‌లో టచ్ స్క్రీన్, ఫ్రంట్ కెమెరా, ఆధార్‌తో అనుసంధానమైన ఫింగర్ ప్రింట్ స్కానర్, మైక్రోఫోన్, స్పీకర్లు ఉంటాయి. కియోస్క్ ఎదుట రైతు నిలబడి వేలితో టచ్ స్క్రీన్‌ను తాకి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
వివిధ కంపెనీలకు సంబంధించిన పంటల విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, పశువుల దాణా వంటి వాటి ఉత్పత్తుల బోమ్మలు, వాటి ధరవరలు కియోస్క్ మీద ప్రత్యక్ష మౌతాయి. రైతులు ఏం కొనాలో, ఎంత పరిమాణంలో కొనాలో ఒకటికి రెండు సార్లు చూసుకోని క్లిక్ చేస్తే ఆర్డర్ ప్రింట్ అయి వస్తుంది.
ఆ ఆర్డర్ రెండు నుంచి మూడు రోజుల్లో మార్కెటింగ్ శాఖ అధికారులు రైతుల ఇళ్ల వద్దకు తెచ్చి ఇస్తారు. విత్తనాలను ఎపి సీడ్స్, మిగతావాటిని ఆగ్రోస్ సెంటర్లు సరఫరా చేస్తాయి.