పాత్ర ఎంతసేపు అన్నది కాదు.. ఆ తెలుగు డైరెక్టర్ తో పని చెయ్యడం నా కల: ఆలియా భట్

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో మంచి జోరు మీద బాలీవుడ్‌ను ఏలుతోంది. ఇటీవ‌ల విడుద‌ల అయిన ఆలియా సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశాయి. ఇక ఈమె బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా న‌టిస్తోంది.

అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇద్ద‌రు స్టార్ హీరోలైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లతో ఆర్ఆర్ఆర్ సినిమా తెర‌కెక్కించ‌బోతున్న‌ సంగ‌తి తెలిసింది. మల్టీస్టారర్‌‌గా రాజ‌మౌళి రూపొందిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో బాలీవుడ్‌ నటి ఆలియా భట్ రామ్‌చ‌ర‌ణ్‌కు జంట‌గా న‌టిస్తోంది. రూ. 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాలో ఆలియా పాత్రపై ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. ఈ చిత్రంలో ఆమె కేవ‌లం కొన్ని స‌న్నివేశాల్లోనే క‌నిపిస్తార‌ని, చాలా చిన్న పాత్ర‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది

అయితే ఇటీవ‌ల దీనికి చెక్ పెడుతూ ఆలియా స్పందించింది. ఆమెకు రాజ‌మౌళితో ప‌ని చేయ‌డం త‌న కల అని చెప్పింది. కరణ్ జోహార్ నన్ను నటుడిగా పరిచయం చేసిన తర్వాత నా విష్ లిస్ట్ లో ఇద్ద‌రు డైరెక్టర్లు చేరారు. వారే సంజయ్ లీలా బన్సాలీ, ఎస్.ఎస్.రాజమౌళి అని ఆమె పేర్కొంది. అలాగే ఈ చిత్రంలో త‌న పాత్ర ఎంత సేపు ఉన్నా ప‌ర్వాలేద‌ని తెలిపింది. కేవ‌లం జ‌క్క‌న్న‌తో క‌లిసి తెలుగు సినిమాలో ప‌ని చేయ‌డ‌మే త‌న‌ ఆశ అని ఆమె వెల్లండించింది.

ఈ సినిమా కోసం ఆలియా ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుంటుందట. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ప్రతి రోజూ తెలుగు నేర్చుకోవడం కోసం ఓ ట్రైనర్‌ను ఏర్పాటు చేసుకుందట. కొద్దికొద్దిగా అర్ధం చేసుకోగలుగుతున్నాను కానీ పదాలను సరిగ్గా పలకలేకపోతున్నా అంటూ చెప్పుకొచ్చింది ఆలియా.