బాబ్రీ మసీదు కూల్చివేత : ఏదో ఆవేశంలో జరిగిందట.. కోర్టు తీర్పు
Timeline

బాబ్రీ మసీదు కూల్చివేత : ఏదో ఆవేశంలో జరిగిందట.. కోర్టు తీర్పు

ఏళ్ల నుంచి దేశమంతా చర్చగా మారిన , రాజకీయ రచ్చకు కారణం అయిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు తెరపడింది. మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీ(92), మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి సురేంద్ర కుమార్‌ యాదవ్‌ తీర్పును వెల్లడించారు.

విచారణలో భాగంగా 351 మంది సాక్షులను సీబీఐ విచారించింది. ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు ఆరోపణలు ఎదుర్కోగా కేసు విచారణలో ఉండగానే 17మంది మరణించారు. 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సెప్టెంబర్‌ 30న కీలక తీర్పు వెలువరించింది.

తీర్పు సమయంలో ప్రస్తుతమున్న 32మంది నిందితులంతా కోర్టులో హాజరు కావాలని సెప్టెంబర్‌ 16న న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. అయితే, వయోభారం, కరోనా కారణంగా ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, మహంత్‌ నృత్యగోపాల్‌ దాస్‌‌లు కోర్టుకు హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది.

ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌లకు కరోనా సోకడంతో వారు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో వారు తీర్పు సమయంలో కోర్టుకు హాజరుకాలేదు. వీరంతా తీర్పు సమయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అందుబాటులో ఉన్నారు.