అల.. సుక్కుతో… ప్రాజెక్టు మొదలెట్టిన బన్నీ

నాపేరు సూర్యతో తగిలిన ఎదురుదెబ్బ బన్నీలో పెద్ద మార్పే కనిపిస్తోంది. ఆ సినిమా తరువాత కొత్త ప్రాజెక్టు ప్రకటించడానికి కథ విషయంలో భారీగానే కసరత్తు చేశాడు. అటుతిరిగి ఇటుతిరిగి చివరకు -హ్యాట్రిక్ సక్సెస్‌పై నమ్మకంతో ప్రాజెక్టును దర్శకుడు త్రివిక్రమ్ చేతిలో పెట్టాడు. అలా -అల.. వైకుంఠపురం మొదలైందో లేదో మరో ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడని వినిపిస్తోంది.

రంగస్థలం హిట్టు తరువాత -స్టార్ హీరోల వెయిటింగ్ లిస్ట్‌లో ఉండిపోయిన సుకుమార్‌తో డీల్ ఓకే చేసుకున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల్లో -ఆర్యకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సుకుమార్ ఇచ్చిన స్టయిలిష్ సినిమాతో బన్నీకి ఓ ట్రాక్ క్రియేటైంది. అదే కాంబినేషన్‌లో చేసిన ఆర్య 2 సైతం -బ్లాక్‌బస్టర్ కాకపోయినా బన్నీ స్టామినాను రుచి చూపించింది. ఆ స్టయిల్ మ్యాజిక్ బన్నీకే సాధ్యమన్నంత పేరు తెచ్చింది కూడా. అలాంటి హిట్టు కాంబినేషన్‌లో మరో సినిమాకు బన్నీ సై అన్నాడని సమాచారం.

అక్టోబర్ 2న సైరా విడుదలవుతుంటే -మరుసరి రోజే బన్నీ సినిమాను లాంచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అక్టోబర్ 15నుంచి రెగ్యులర్ షూటింగ్‌నూ మొదలెట్టనున్నారట. త్రివిక్రమ్‌తో అల.. వైకుంఠపురములో ప్రాజెక్టు చేస్తూనే, గ్యాప్‌లేకుండా సుక్కూ చిత్రానికి డేట్స్ ఫిక్స్ చేసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అంటే అక్టోబర్ చివరి వరకూ సుక్కూ ప్రాజెక్టు షెడ్యూల్ కంప్లీట్ చేసి, ఆ తరువాత త్రివిక్రమ్‌తో ప్రాజెక్టు షూటింగ్ పూర్తి చేయొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

ఇద్దరు స్టార్ డైరెక్టర్స్‌తో రెండు ప్రాజెక్టుల్ని బన్నీ సమాంతరంగా పూర్తి చేస్తాడన్న మాట. కొత్త ప్రాజెక్టు ఎంతవరకూ కరెక్టన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.