రామ్ గోపాల్ వర్మని చూస్తే జాలేస్తోందని మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ప్రణయ్ హత్య’ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ‘ మర్డర్’ పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్, టైటిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రణయ్-అమృతల ప్రేమ వ్యవహారం, ఆపై మారుతీరావు చేయించిన పరువు హత్య నేపథ్యంగా సినిమా తీయనున్నట్టు పోస్టర్ చూస్తే అర్థమౌతోంది. దీనిపై తాజాగా అమృత స్పందించారు.
పోస్టర్ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఇప్పటికే నా జీవితం తలకిందులైంది. ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్‌ను పోగొట్టుకున్నాను. కన్న తండ్రికి కూడా దూరమయ్యాను. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పా? దీని వల్ల ఎన్నో చీత్కారాలను ఎదుర్కొన్నాను. ఎవరికి వారు నా గురించి, నా క్యారెక్టర్ గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. నా సన్నిహితులకు తప్ప నా గురించి ఎరికీ తెలియదు. గర్వంతో, పరువుపోతుందన్న తప్పుడు ఆలోచనల్లో పడి ప్రణయ్‌ను నా తండ్రి హత్య చేయించాడు. కిరాయి గూండాలకు డబ్బులిచ్చి ఈ పాపానికి ఒడిగట్టాడు. ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్నాను. ఆత్మగౌరవంతో బతుకుతున్నాను. ఏదో అలా కాలం వెళ్లదీస్తున్నాను. ఇప్పుడు రామ్‌గోపాల్ వర్మ రూపంలో మరో కొత్త సమస్య ఎదురవుతోంది. దీన్ని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. ఏడుద్దామన్నా కన్నీళ్లు రావడం లేదు. హృదయం బండబారి పోయింది. దయచేసి నా జీవితాన్ని బజారులో పెట్టొద్దు. రామ్‌గోపాల్ వర్మ పోస్టర్ విడుదల చేస్తారని తెలిసినప్పటి నుంచి భయంతో వణికి పోయాను. నా కొడుకుని చూసుకుంటూ, ఉన్నంతలో ప్రశాంతంగా బతకడానికి ప్రయత్నిస్తున్నాను . ఇంతలో సమాజం కళ్లన్నీ మరోసారి నాపై పడేలా రామ్‌గోపాల్ వర్మ చేస్తున్నాడు’’ అని అమృత వాపోయారు.
‘‘నువ్ విడుదల చేసిన పోస్టర్ చూశాను. దీనికి, నా జీవితానికి ఎక్కడా పోలికలు లేవు. ఇదంతా మా పేర్లను ఉపయోగించి నువ్వు అమ్ముకోవాలని చూస్తున్న ఓ తప్పుడు కథ. రెండు నిమిషాల పేరు కోసం నీ లాంటి ఓ ప్రముఖ దర్శకుడు ఇంతటి నీచానికి దిగజారుతాడని ఎప్పుడూ అనుకోలేదు. మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు నిన్ను చూస్తే జాలేస్తోంది. నీపై ఎలాంటి కేసులు వేయను.ఈ నీచ, నికృష్ట, స్వార్థపూరిత సమాజంలో నువ్వూ ఒకడివే. ఎన్నో బాధలను అనుభవించా. ఈ బాధ అంత పెద్దదేం కాదు. రెస్ట్ ఇన్ పీస్’’ అని అమృత ఓ ప్రకటనలో పేర్కొన్నారు.