విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ హైకోర్టు విచారణ
Timeline

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ హైకోర్టు విచారణ

విశాఖ నగరం ఆర్‌ఆర్‌ వెంకటాపురం వద్ద ఉన్న ఎల్‌జి పాలిమర్స్‌ కంపెనీలో ఇటీవల గ్యాస్‌ లీకైన ఘటనపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 

వాదనల అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ  ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

 ఎల్‌జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకై ప్రాణనష్టం జరిగిన ఘటనకు సంబంధించి ఆయా కమిటీల నుంచి నివేదికలు రావాల్సి ఉందని రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌  హైకోర్టుకు నివేదించారు. ఈ నివేదికలు అందిన వెంటనే కోర్టు ముందుంచుతామని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలిపారు. 

పిటిషనర్లు వాదిస్తూ, ఎల్‌జి పాలిమర్స్‌ కంపెనీ డైరెక్టర్లు విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు.  ఎల్‌జీ పాలిమర్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ఎటువంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

ప్రభుత్వం ఇప్పటికే పలు కమిటీలు ఏర్పాటు చేసిందని చెబుతూ ఈ కమిటీల్లో ఏదో ఒక కమిటీకి విచారణ బాధ్యతలు అప్పగించినా అభ్యంతరం లేదని పేర్కొన్నారు.ఇప్పటికే తమ డైరెక్టర్లు పాస్‌పోర్టులను అధికారులకు స్వాధీనం చేశారని చెప్పారు. 

గ్యాస్‌ లీకైన ట్యాంక్‌ మినహా మిగతా ట్యాంకులను దక్షిణ కొరియాకు తరలించామని నివేదిక అందించారు. ఎన్‌జిటి ఆదేశాలతో ఎల్‌జి పాలిమర్స్‌ తరుఫున జిల్లా కోర్టులో రూ.50 కోట్లు డిపాజిట్‌ చేశామని చెప్పారు. అనంతరం ఏదో ఒక సంస్థచే విచారణ జరిపించాలని హైకోర్టును కోరారు. వాదనల అనంతరం కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

Leave a Reply

Your email address will not be published.