నిమ్మగడ్డకు ట్విస్ట్ ఇచ్చిన జగన్.. ముందు నుయ్యి వెనక గొయ్యి
Timeline

నిమ్మగడ్డకు ట్విస్ట్ ఇచ్చిన జగన్.. ముందు నుయ్యి వెనక గొయ్యి

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించినట్టు తనకు తానే ప్రకటించుకున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు జగన్ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఆంధ్ర హైకోర్టు జడ్జిమెంట్ కాపీ వచ్చిందన్న అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. అయితే వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర, జిల్లా అధికారులకు ఒక సర్కులర్ జారీ చేశారని అన్నారు.

రాష్ట్ర ఎన్నికల అధికారిగా తిరిగి బాధ్యతలు చేపట్టినట్లుగా నిమ్మగడ్డ రమేష్ కుమారే ప్రకటించుకున్నారని విజయవాడ కార్యాలయం నుంచి సర్క్యూలర్ విడుదల చేసి, హైదరాబాద్‌లోని తన ఇంటికి వాహనాలు పంపించాలని అందులో ఉందని ఏజీ శ్రీరామ్ వివరించారు. ఎస్ఈసీగా కొనసాగమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు నేరుగా ఎక్కడా చెప్పలేదు అని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం తనంతట తానే బాధ్యతలు స్వీకరించినట్లుగా సర్క్యూలర్ విడుదల చేశారని అన్నారు.

ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం తరపున హైకోర్టులో ఒక పిటిషన్ వేశామని ఏజీ శ్రీరామ్ తెలిపారు. అప్పటివరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా కోరామని ఆయన వివరించారు. రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం రాష్ట్రానికి లేదంటే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా ఈ నిబంధనే వర్తిస్తుందని అలాంటప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం ఎలా నియమిస్తుందని ఆయన అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కూడా అప్పటి సీఎం చంద్రబాబు సలహా మేరకే నియమించారని తెలిపారు. గవర్నర్ నిర్ణయంలో మంత్రి మండలి సలహా అవసరం లేదంటే.. అప్పటి సీఎం చంద్రబాబు ఇచ్చిన సలహా కూడా చెల్లదని కామెంట్ చేశారు.

హైకోర్టు తీర్పులో కాలవ్యవధి స్పష్టంగా చెప్పకుంటే.. రెండు నెలల కాలవ్యవధి ఉంటుందని ఏజీ శ్రీరామ్ అన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదని అన్నారు. ఎస్ఈసీ స్టాండింగ్ కౌన్సిల్ గా ఉన్న ప్రభాకర్ ను రేపటిలోగా రాజీనామా చేయమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారని… ఈ విషయం ప్రభాకర్ తనకు ఫోన్ చేసి చెప్పారని శ్రీరామ్ తెలిపారు. తనకు కొంత సమయం కావాలని ప్రభాకర్ నిమ్మగడ్డను కోరారని… నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం రేపటిలోగా రాజీనామా చేయమని ఆదేశించారని వెల్లడించారు.

ఇప్పటికే స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరిందని… ఎస్ఈసీ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని ఏజీ శ్రీరామ్ చెప్పారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం కూడా చట్ట విరుద్ధమని.. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదని అన్నారు. సాధారణంగా ప్రభుత్వ న్యాయనిపుణులు ఎప్పుడూ మీడియా ముందుకు రారని… కానీ ఇది రాజ్యాంగ అంశాలు హైకోర్టు తీర్పుతో కూడినందున మీడియా ముందుకు రావాల్సివచ్చిందని ఏజీ శ్రీరామ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published.