Breaking News :

లోకేష్ పై హోం మంత్రి ఆగ్రహం

పార్టీల ప్రమేయం లేకుండా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడితే, టీడీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం బీకేపాలెంలో శుక్రవారం రాత్రి ఆమె విలేకరులతో మాట్లాడారు. గతేడాది గోవాళ్లపల్లి నాగమణి వ్యక్తిగత కారణాలతో ఉన్నవ శ్రీనివాసరావుపై ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆ కేసుపై సాక్షులతో విచారణ జరిగిందన్నారు. తీర్పు వెలువడే సమయంలో శ్రీనివాసరావు ఆత్మహత్యకు యత్నించారు. చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ చనిపోయారన్నారు. అప్పుల బాధతో ఇలా చేసుకున్నారని మృతుడి భార్య ఫిర్యాదు చేశారన్నారు. మూడు రోజుల తర్వాత శ్రీనివాస్‌ జేబులో సూసైడ్‌ లేఖ ఉందన్నారు.

అందులో నాగమణి ఇబ్బంది పెట్టడంతోనే ఆత్యహత్యకు పాల్పడ్డారని ఉందన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు, పార్టీల ప్రస్తావన రాలేదన్నారు.
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన లోకేశ్‌ శవ రాజకీయాలకు పాల్పడటం దారుణమని విమర్శించారు. ఆత్మహత్య ఎలా చేసుకున్నాడో తెలుసుకోకుండా టీడీపీ వారు మాట్లాడి అభాసుపాలు అవుతున్నారన్నారు. ఖాకీ చొక్కాలు వైసీపీ నాయకులకు అనుకూలంగా ఉన్నారని, పోలీస్‌స్టేషన్లకు ఆ పార్టీ రంగులు వేసుకోవాలని లోకేశ్‌ అనడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ ఆరోపిస్తున్న 7 హత్యలలో ఒక్కటీ రాజకీయానికి సంబంధం లేదన్నారు.

ఎన్నికల సమయంలో ఒక హత్య జరిగిందని, అది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అయ్యిందన్నారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు అనుకూలంగా పని చేయాలని అధికారులకు చెప్పారని విమర్శించారు. తమ సీఎం జగన్‌ తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేని అరెస్ట్‌ చేయించి అందరికి సమన్యాయం జరిగేలా సీఎం చూడటమే ఇందుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వంలో మహిళా అధికారి వనజాక్షిపై దాడులు చేస్తే కనీసం కేసులు పెట్టలేదన్నారు. అబద్ధపు మాటాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తే అభాసు పాలవుతారన్నారు. ఇకనైనా టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆమె అన్నారు.

Read Previous

రచ్చబండ కార్యక్రమంపై జగన్ క్లారిటీ

Read Next

స్త్రీనిధి చెక్కుల పంపిణీ