Breaking News :

సుప్రీంకోర్టులో అర్ణబ్ కేసు.. 3 వారాలు సెక్యూరిటీ

రిప‌బ్లిక్ టీవీ ఎడిట‌ర్‌, జ‌ర్న‌లిస్టు అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు ఊర‌ట‌నిచ్చింది.  ఆయ‌న‌పై మూడు వారాల పాటు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దు అని కోర్టు పేర్కొన్న‌ది. టీవీ షోలో విద్వేష‌పూరితంగా మాట్లాడిన‌ట్లు ఆయ‌న‌పై ప‌లు పోలీసు స్టేష‌న్ల‌లో ఎఫ్ఐఆర్‌లు న‌మోదు అయ్యాయి. 

జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌తో కూడిన‌ ధ‌ర్మాస‌నం ఇవాళ వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా కేసును ప‌రిశీలించింది. ఈ మూడు వారాల వ్య‌వ‌ధిలో గోస్వామి ముందస్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు అని చెప్పింది. నాగ‌పూర్‌లో నమోదు అయిన కేసును ముంబైకి బ‌దిలీ చేసేందుకు కూడా కోర్టు అంగీక‌రించింది.  

అక్క‌డే ఈ కేసులో విచార‌ణ కూడా జ‌ర‌గ‌నున్న‌ది. చ‌త్తీస్‌ఘ‌డ్‌, రాజ‌స్థాన్, పంజాబ్‌, తెలంగాణ‌, జ‌మ్మూక‌శ్మీర్ రాష్ట్రాల్లో దాఖ‌లైన ఎఫ్ఐఆర్‌ల‌పై కూడా విచార‌ణ నిలిపివేయాల‌ని సుప్రీం బెంచ్ ఆదేశించింది.  

గురువారం రాత్రి అర్నాబ్ సుప్రీంను ఆశ్ర‌యించారు. అయితే లాక్‌డౌన్ వేళ సుప్రీం కేవ‌లం అత్య‌వ‌స‌ర కేసుల‌ను మాత్ర‌మే విచారిస్తున్న‌ది. ఇవాళ కోర్టులో అర్నాబ్ త‌ర‌పున సీనియ‌ర్ అడ్వ‌కేటు ముఖుల్ రోహ‌త్గీ వాదించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గోస్వామిపై కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆయ‌న కోర్టుకు వెల్ల‌డించారు. టీవీ షోల‌కు ప్ర‌తీకారంగా కేసులు వేసిన‌ట్లు చెప్పారు.

ఓ కాంగ్రెస్ నేత చేసిన రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌ను మాత్ర‌మే తాను ప్ర‌శ్నించిన‌ట్లు గోస్వామి కోర్టుకు తెలిపారు. కేవ‌లం కాంగ్రెస్ పార్టీ చీఫ్‌ను మాత్ర‌మే గోస్వామి ప్ర‌శ్నించిన‌ట్లు రోహ‌త్గీ కోర్టుకు చెప్పారు.  అయితే ముంబైలోని అత‌ని నివాసం వ‌ద్ద ఇద్ద‌రు వ్య‌క్తులు దాడి చేశారు. దాంతో త‌న‌కు ర‌క్ష‌ణ కావాల‌ని పోలీసుల‌ను వేడుకున్నారు. 

త‌న‌పై న‌మోదు అయిన ఎఫ్ఐఆర్‌లు.. ప‌త్రికా స్వేచ్ఛ‌కు విఘాతాలు అని గోస్వామి ఆరోపించారు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున క‌పిల్ సిబ‌ల్ వాదించారు.  

తనపై ఇటీవల పలుచోట్ల దాఖలైన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి హర్షం వ్యక్తం చేశారు. వార్తలను వెలుగులోకి తెచ్చి, ప్రసారం చేసేందుకు.. రాజ్యాంగం ప్రకారం ఒక జర్నలిస్టుగా తన భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడుకునేందుకు సుప్రీంకోర్టు అండగా నిలిచిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై సర్వోన్నత న్యాయస్థానానికి తాను కృతజ్ఞతలు చెబుతున్నానని గోస్వామి పేర్కొన్నారు.

Read Previous

బ్రేకింగ్: జగన్ తీసేసాడు, కేంద్రం ప్రమోషన్ ఇచ్చింది

Read Next

రాజధాని తరలింపు పై జగన్ వెనకడుగు