- సీఎం సహాయ నిధి నుంచి రూ.112 కోట్లు కొల్లగొట్టే కుట్ర
- బ్యాంక్ అధికారులు అప్రమత్తతో బట్టబయలైన కుంభకోణం
- మొత్తం వ్యవహారంపై దృష్టి సారించిన పోలీసులు
అమరావతి:
ఆపదలో ఆదుకునేందుకు ఇచ్చే ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతో ఓ భారీ నేర పర్వానికి లేపిన తెరను బ్యాంక్ అధికారులు అప్రమత్తతో అడ్డుకోగలిగారు.తీవ్ర సంచలనం రేపుతున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధ పడుతున్న వారు తమను ఆదుకోవాలంటూ చేసుకునే విజ్ఞప్తులకు స్పందించే ముఖ్యమంత్రి, తన సహాయ నిధి తో (సీఎంఆర్ఎఫ్) వారిని ఆదుకోవడం ఆనవాయితీ. సరిగ్గా దాన్నే క్యాష్ చేసుకోవాలని కొందరు ప్రయత్నించారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.112 కోట్లు కొల్లగొట్టేందుకు నకిలీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు తయారు చేశారు. ఢిల్లీ, బెంగుళూరు, కోల్‌కత్తాలోని మూడు బ్యాంకుల ద్వారా నగదుగా మార్చుకునేందుకు ప్రయత్నించారు. భారీ మొత్తం కావడంతో ఆయా బ్యాంకులు, వెలగపూడిలోని ఎస్బీఐని సంప్రదించడంతో ఈ నేర పర్వం బట్టబయలైంది.
బెంగళూరు సర్కిల్, మంగళూరులోని మూడ్‌బద్రి శాఖకు రూ.52.65 కోట్ల చెక్కును, ఢిల్లీలోని సీసీపీసీఐ కి రూ.39,85,95,540 చెక్కును, కోల్కత్తా సర్కిల్లోని మోగ్రాహత్ శాఖకు రూ.24.65 కోట్ల చెక్కును క్లియరెన్స్ కోసం గుర్తు తెలియని వ్యక్తులు సమర్పించారు. ఈ మూడు చెక్కులు విజయవాడ, ఎంజీ రోడ్లో ఉన్న బ్రాంచ్‌కు చెందినట్లు ఉండగా, వాటిపై సీఎంఆర్ఎఫ్, రెవెన్యూ శాఖ, సెక్రటరీ టు గవర్నమెంట్ అన్న స్టాంప్‌పై సంతకం చేసి ఉంది.
క్లియరెన్స్ కోసం దాఖలు చేసిన చెక్కులపై ఉన్న వివరాల ఆధారంగా వాటిని ధృవపర్చుకునేందుకు ఢిల్లీ, బెంగళూరు, కోల్కత్తా సర్కిళ్లకు చెందిన ఆయా బ్యాంకుల అధికారులు, ఇక్కడికి ఫోన్ చేయడంతో నకిలీ పర్వం బయట పడింది.