బాలయ్య దర్శకత్వం వహించిన నర్తనశాల @ దసరా రోజు

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌ మూవీ ‘నర్తనశాల’. ఈ సినిమాను తిరిగి నిర్మించాలన్నది నందమూరి బాలకృష్ణ కల. ఈ చిత్రాన్ని కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి తగ్గ తనయుడిగా, ఎన్టీఆర్ నటవారసుడిగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుంటున్న బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు.

అందుకే, ఆగిపోయిన ఆ సినిమాను ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు బాలకృష్ణ. దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, నందమూరి అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం ఎన్.బి.కె థియేటర్‌లో శ్రేయాస్ ఈటీ ద్వారా అక్టోబర్ 24న విడుదలవుతుంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీకి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించారు. ఈ విషయాన్ని బాలకృష్ణ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు.

‘లక్ష్మీనరసింహ’ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించిన లక్ష్మీపతి ఈ చిత్రానికి నిర్మాత. బాలకృష్ణ అర్జునుడి గానూ, సౌందర్య ద్రౌపది గానూ, శ్రీహరి భీముడి గానూ, శరత్ బాబు ధర్మరాజుగానూ ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. వీరి కాంబినేషన్‌లో కొన్ని సీన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత సౌందర్య హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించడంతో బాలకృష్ణ కలల ప్రాజెక్ట్‌ ‘నర్తనశాల’ ఆగిపోయింది. అయితే, ‘శ్రీరామరాజ్యం’ చిత్రం చేసిన తరవాత బాలయ్యలో మళ్ళీ ‘నర్తనశాల’ ఆశలు చిగురించాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, అవి కార్యరూపం దాల్చలేదు. ఇక ఇప్పుడు ఆ సినిమా చేసే ఆలోచన బాలకృష్ణకు లేదు.