‘సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు’లను గవర్నర్‌ ఆమోదానికి ఏపీ ప్రభుత్వం శనివారం పంపించిన సంగతి తెలిసిందే.

ఈ విషయంలో బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ..సొంత పార్టీలోనే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లును ఆమోదించవద్దని, దాన్ని తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపించాలంటూ కన్నా లేఖ రాయడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమౌతోంది.

కన్నా లక్ష్మీనారాయణపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ వైఖరికి బిన్నంగా లేఖ రాయడంపై కేంద్ర నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాజధాని బిల్లులను ఆమోదించవద్దని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ కు లేఖ రాశారు కన్నా.. అయితే అచ్చం టీడీపీ లైన్ లో లేఖ రాసినట్టు కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై గవర్నర్ కు వివరణ ఇవ్వాలనే ఏపీ బీజేపీ నేతలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

శాసనమండలిలో రెండోసారి పెట్టి నెల రోజులు గడిచినందున నిబంధనల ప్రకారం అసెంబ్లీ అధికారులు.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 197 క్లాజ్‌ 2 ప్రకారం రెండోసారి బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లులను సుప్రీం కోర్ట్ అటార్నీ జనరల్ సలహా తీసుకోకుండా ఆమోదించవద్దని గవర్నర్ కు టీడీపీ విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాదు ఆమోదిస్తే కోర్టుకు వెళతామని కూడా అంటోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం బిల్లులు ఖచ్చితంగా ఆమోదం పొందుతాయని ధీమాగా ఉన్నారు. సోమవారం సాయంత్రానికల్లా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.