15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

6

కర్నాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టు ముందు విచారణలో ఉన్నందున ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఈసి గురువారం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇది జరిగిన ఒకరోజు తర్వాతనే ఈసి ఎన్నికల తేదీని ప్రకటించడం గమనార్హం.

మహరాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఈనెల 23న ప్రకటించింది. ఈ జాబితాలో కర్నాటకలోని 15 అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలకు చెందిన సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను అక్టోబర్‌ 22 నాటికి వాయిదా వేసింది. శానసభ్యుల కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉందన్న అంశంపై విస్తృతంగా చర్చించి డిసెంబర్‌ 5న ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల సంఘం పేర్కొంది. డిసెంబర్‌ 9న ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది.