తెలంగాణ వీర మహిళ మన చాకలి ఐలమ్మ గురించి తెలుసా ?
Timeline

తెలంగాణ వీర మహిళ మన చాకలి ఐలమ్మ గురించి తెలుసా ?

20వ శతాబ్దం మొదటికాలంలో ఉత్పత్తికులాల (బీసీ కులాల) చేత అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను ‘‘దొరా’’ అని పిలుపించుకునే సంస్కృతియే ఎక్కువగా వుండేది. ఆ సమయంలో దొరా అని పిలవకపోతే వాళ్లంతా ఉత్పత్తికులాల వారిపై తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించేవారు. వెనుకబడిన కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసగొల్పి, దగ్గరుండి మరీ అఘాయిత్యం చేయించేవారు అగ్రకులాల స్త్రీలు. అటువంటి సంస్కృతికి వ్యతిరేకంగా మొదటిసారిగా గళం విప్పిన తెలంగాణ వీరవనిత ‘‘చాకలి ఐలమ్మ’’! తన పంటపొలాలను దోచుకోవడానికి దొరసానులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ.. ఆమె వారి పరాక్రమాలకు ఏమాత్రం భయపడకుండా తన పొలాలను కాపాడుకోగలిగింది. తనమీద దాడిచేయడానికి వచ్చిన వారిని ‘‘నీ దొరోడు ఏం చేస్తాడ్రా’’ అంటూ ధైర్యంతో రోకలి బండ సహాయంతో గూండాలనే తరిమికొట్టిన ధైర్యశాలి. ఆనాడు ఆమె ప్రదర్శించిన ధైర్యాన్ని నాడు సామాజిక ఆధునిక పరిమాణానికి నాందిగా భావిస్తారు.

జీవిత విశేషాలు :

1919లో వరంగల్ జిల్లా, రాయపర్తి మండలంలోని క్రిష్టాపురం గ్రామంలో చాకలి ఐలమ్మ జన్మించింది. ఈమె అసలు పేరు చిట్యాల ఐలమ్మ. ఈమె వివాహం పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో జరిగింది. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఆర్థికంగా వీరి కుటుంబం వెనుకబడింది కాబట్టి.. చాకలి కులవృత్తే వారికి జీవనాధారంగా వుండేది. వీళ్లు ఎన్నో కష్టాలను అనుభవించి తమ భూములను కాపాడుకోగలిగి, పంటపొలాలను సాగుచేసేవారు.

దొరలపై వ్యతిరేక తిరుగుబాటు :

ఆనాడు అగ్రకులాల స్త్రీలు, దొరసానులు ఉత్పత్తికులాల (బీసీ కులాల) ద్వారా తమను ‘‘దొరా’’ అని పిలుపించుకునేవారు.. వారి భూములను అక్రమంగా ఆక్రమించుకునేవారు. ఒకవేళ అలా పిలవకపోయినా, తమ భూములను వారికి అప్పగించకపోయినా ఉన్నతకులాల స్త్రీలు వెనుకబడినకులాల మహిళలపై తమ భర్తల ద్వారా దగ్గరుండిమరీ అఘాయిత్యాలు చేయించేవారు. అటువంటి సమయంలో జన్మించిన ఐలమ్య… ఆ ఉన్నలకులాలవారి సంస్కృతికి వ్యతిరేకంగా గళం విప్పింది. ‘‘ఈ భూమినాది… పండించిన పంటనాది… తీసుకెళ్లడానికి ఆ దొర ఎవడు..? నా ప్రాణం పోయాకే ఈ పంటను, భూమిని మీరు దక్కించుకోగలరు’’ అంటూ దొరల గుండెల్లో మాటల తూటాల్ని దింపింది ఐలమ్మ!

భూ వివాదం కథ :

మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి వుండేది. వాటిని ఐలమ్మ కౌలుకు తీసుకుంది. ఆ 40  ఎకరాల్లో నుంచి నాలుగు ఎకరాలు సాగుచేశారు. ఆవిధంగా ఆమె సాగుచేయడం వల్ల పాలకుర్తి పట్వారీ వీరమనేని శేషగిరిరావుకు, ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. ఆనాడు జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. అందులో ఐలమ్మ సభ్యురాలిగా వుండేది. పాలకుర్తి పట్వారీ శేషగిరిరావు ఐలమ్మను తన కుటుంబంతోసహా వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేశాడు. అయితే ఆమె అందుకు నిరాకరించింది. పట్వారీ ఎన్నివిధాలుగా ప్రయత్నించినా ఐలమ్మ ఒప్పుకోకపోవడంతో ఆమె కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రాపాక రాంచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఆ కేసులో అగ్రనాయకులతోపాటు ఐలమ్మ కుటుంబాన్ని కూడా ఇరికించారు. కానీ.. చివరకు దేశ్‌ముఖ్‌కు కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అప్పుడు అతను ఓ పన్నాగం పన్నుతాడు.

ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థిక దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని దేశ్’ముఖ్ భావిస్తాడు. అప్పుడతడు పట్వారిని పిలుపించుకుని, ఐలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించుకున్నాడు. అలా అక్రమంగా భూమిని ఆక్రమించిన దేశ్’ముఖ్.. ఆ భూమిలో పండించిన ధాన్యమంతా తనదేననంటూ ఆ పంటను కోసుకుని రావాల్సిందిగా 100 మందిని పంపాడు. అయితే అంతలోనే ఆంధ్రమహాసభ కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. ఆ సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పువచ్చింది. అలా ఆవిధంగా దేశ్’ముఖ్ రెండుసార్లు ఐలమ్మను దెబ్బతీయడానికిపోయి తానే ఓడిపోయాడు. దాంతో కక్షపెంచుకున్న అతడు.. ఐలమ్మ ఇంటిని తగులబెట్టించాడు. ధనాన్ని, ధాన్యాన్ని కూడా ఎత్తుకెళ్లారు. అంతేకాదు.. ఐలమ్మ ఒకానొక కూతురైన సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఐలమ్మ కుమారులు.. అప్పటికప్పుడే పాలకుర్తి పట్వారీ ఇంటిని కూల్చేసి.. అదేస్థలంలో మొక్కజొన్న పంటను పండించారు.

ఐలమ్మ కుటుంబానికి ఎన్నిరకాలుగా నష్టాలు వాటిల్లినాకూడా వాళ్లు తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఎర్రజెండాను వీడలేదు. ‘‘ఈ దొరగాడు ఇంతకంటే నన్ను ఏవిధంగా నష్టపెట్టగలడు’’ అని ప్రశ్నించుకున్న ఆమె..  ధైర్యంతో రోకలిబండ చేతపట్టుకుని గూండాలను తరమికొట్టింది. కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది. ఐలమ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. అయిలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాలవారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. ఇలా ఈ విధంగా ఐలమ్మ దొరలకు వ్యతిరేకంగా పోరాటం  మొదలుపెట్టి.. ఆధునిక ఆధునిక పరిమాణానికి నాందిగా నిలిచిన ధైర్యశాలిగా పేరుగాంచిన ఈమె సెప్టెంబర్‌ 10, 1985న అనారోగ్యంతో మరణించింది.

తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి నేడు..ఈ సందర్భంగా వారికివే మా ఘన నివాళులు