ఛలో ఆత్మకూరు టెన్షన్ గుంటూరు జిల్లాలో ఉద్రిక్తతంగా మారింది. ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద హై టెన్షన్ కనిపిస్తోంది. మాజీ మంత్రి లోకేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయన ఇంటి వద్దకు వస్తున్న పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు.
విజయవాడ.. కర్నూలు నుండి వచ్చిన నేతలు చంద్రబాబు ఇంటి వద్ద పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు ఛలో ఆత్మకూరు కు బయల్దేరనున్నారు. ఆ సమయంలో పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తారు.. చంద్రబాబును ముందుకు వెళ్లనిస్తారా.. కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారనేది ఉత్కంఠ భరితంగా మారింది.
అయితే, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి నుండి బయటకు రానీయకుండా హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ బాబు ఛలో ఆత్మకూరు కు వెళ్తే మాత్రం ఆరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కరకట్ట మొత్తం పోలీసుల అదుపులో ఉంది. ఏ ఒక్కరినీ అక్కడకు రానీయటం లేదు. ఇక, పల్నాడులో అదనపు బలగాలను మొహరించారు. మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు.. నక్కా అనంద్ బాబు ఇళ్ల నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం.. బాధితులు ఉంటున్న పునరావాస శిబిరం వద్ద దాదాపు కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.