పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది: చంద్రబాబు

ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. గ్రామ పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది అని అన్నారు చంద్రబాబు. ఎన్నికల్లో నిజమైన హీరోలు ప్రజలేనని, ఎన్ని విధాలుగా హింసించినా ఎదురొడ్డి పోరాడారని చెప్పారు.

ప్రజల గుండెల్లోనుంచి టీడీపీని ఎవరూ తీసివేయలేరని మరోసారి తేలిపోయిందని చంద్రబాబు చెప్పారు. వైసీపీ నేతలు గాలిమాటలు మాట్లాడుతున్నారని, రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. టీడీపీకి 38.74 శాతం పోలింగ్‌ నమోదైందిని తెలిపారు.

బలవంతపు ఏకగ్రీవాలకు టీడీపీ వ్యతిరేకమన్నారు. అఖిల భారత సర్వీసు అధికారులను బెదిరిస్తున్నారని, ఏ తప్పూ చేయని టీడీపీ నేత కొల్లు రవీంద్రపై కేసు పెట్టారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయించి బెదిరిస్తోందని ఆరోపించారు. ఎస్‌ఈసీ చెబితే వినొద్దని మంత్రి పెద్దిరెడ్డి ఉద్యోగులకు చెబుతారా అంటూ ధ్వజమెత్తారు.