సొంత బాబాయ్‌ని ఎవరు హత్య చేశారో చెప్పలేని వ్యక్తి.. మీరు మమ్మల్నా భయపెట్టేది

వైసీపీ నేతల ఆటలు సాగనిచ్చేది లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇష్టానుసారంగా దాడులు చేస్తామంటే ఊరుకోబోమంటూ వార్నింగ్‌ ఇచ్చారాయన. ఎన్ని కేసులు పెడతారో పెట్టమనండి మనమూ చూద్దాం అన్నారు. ముందు తనపై కేసులు పెట్టాలంటూ వైసీపీ నేతలకు చంద్రబాబు సవాల్‌ విసిరారు.

సొంత బాబాయ్‌ని ఎవరు హత్య చేశారో చెప్పలేని వ్యక్తి మనల్ని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. బెదిరించి, భయపెట్టి రాజకీయాలు చేయడం వారి వాళ్ల కాదన్నారు చంద్రబాబు.

టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు.. పల్నాడుని రక్షించుకోవడానికి ఈ నెల 11న చలో ఆత్మకూరు చేపడతామని పిలుపు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఒంటరి కాదని చలో ఆత్మకూరు ద్వారా చాటి చెప్పాలన్నారు. చలో పల్నాడుకు టీడీపీ నాయకులంతా తరలి రావాలని సూచించారు. పోలీసులు పెట్టే ప్రతి అక్రమ కేసుకు సమాధానం చెప్పేలా చేద్దామన్నారు.

మానవ హక్కుల సంఘానికి సమస్య తెలియజేయడంతో పాటు.. ప్రైవేట్ కేసులు పెడదామన్నారు. ఈ నెల 10న న్యాయవాదుల సమావేశం ఏర్పాటు చేయాలని, లీగల్‌ సెల్‌ను పటిష్ట పరచాలని చంద్రబాబు నేతలకు సూచించారు.