ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 కు చంద్రుడిపై ఆఖరి నిమిషంలో ఇబ్బంది ఏర్పడింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ కాలుమోపడానికి ముందు 15 నిమిషాలు ఎంతో కీలకమైనవి. 13 నిమిషాల వరకూ సిగ్నల్స్ అందుతూ సాఫ్ట్ ల్యాండింగ్ కు దగ్గర పడుతూండగా ఒక్కసారిగా ల్యాండర్ నుంచి స్పేస్ సెంటర్ కు సిగ్నల్స్ ఆగిపోయాయి. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై ప్రయాణించడం చూద్దామనుకున్న కోట్లాదిమందికి నిరుత్సాహం ఎదురైంది.

సరిగ్గా చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో సిగ్నల్స్ అందక విక్రమ్ ల్యాండింగ్ ఆగిపోయింది. దీంతో బెంగళూరులోని ఇస్రో కంట్రోల్ రూమ్ నిశ్శబ్దంగా మారిపోయింది. పరిస్థితి అర్ధమై శాస్త్రవేత్తలు మిన్నుకుండిపోయారు. సిగ్నల్స్ రావటం కష్టమని తేలాక ఇస్రో చైర్మన్ శివన్ దీనిపై అధికారిక ప్రకటన చేశారు. ల్యాండర్ నుంచి సిగ్నల్స్ అందటం లేదని, దీనిపై విశ్లేషిస్తున్నామంటూ ప్రకటించారు. విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన ప్రధాని మోదీకి ల్యాండింగ్ లో ఏర్పడిన కమ్యూనికేషన్ సమస్యను వివరించారు. దీంతో మోదీ.. “శాస్త్రవేత్తలుగా మీరు సాధించింది తక్కువేమీ కాదు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాం. ఎవరూ నిరుత్సాహపడొద్దు.. మీకు నేనున్నాను” అంటూ శివన్ కు, అక్కడున్న శాస్త్రవేత్తలందరికీ ధైర్యం చెప్పారు. తనతో కలిసి వీక్షణకు వచ్చిన విద్యార్దులతో మోదీ కాసేపు ముచ్చటించారు.

ఇటువంటి సమస్యలు ఒక్కోసారి తప్పవని శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రయాన్ 1 కూడా ఇలాంటి సమస్యతోనే 8 నెలల పాటు సిగ్నల్స్ అందలేదని ఉదహరిస్తున్నారు. చంద్రయాన్ 2 కూడా ఎప్పటికైనా సిగ్నల్స్ ఇస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చివరి ఘట్టం వరకూ ల్యాండర్ నిరంతరాయంగా వెళ్లడమూ గొప్ప విషయమే. ఏమైనా.. శాస్త్రవేత్తలు చంద్రయాన్ 2 కోసం చేసిన కృషిని అభినందించకుండా ఉండలేం.

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings