వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగము: కేసీఆర్ ఛాలెంజ్

నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన భారీ ధన్యవాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా గురించి మాట్లాడుతూ.. గతంలో ఏ నాయకుడు కూడా జిల్లాను పట్టించుకున్న పాపాన పోలేదని గుర్తు చేశారు. అంతేకాక, నల్గొండ జిల్లాకు కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య గురించి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు.

నల్గొండ జిల్లా నెల్లికల్లులో ఇవాళ తాను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను ఏడాదిన్నర లోపు పూర్తి చేయకపోతే…వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమన్నారు సీఏం కేసీఆర్. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రెండున్నర వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ అంటే వీరుల పార్టీ…వీపు చూపించే పార్టీ కాదన్నారు. కృష్ణా,గోదావరి అనుసంధానం చేసి జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. కృష్ణా నీళ్లు రాకపోతే సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలిస్తామన్నారు కేసీఆర్.

నల్గొండ జిల్లాకు కేసీఆర్ వరాల జల్లు ప్రకటించారు. ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు, ప్రతి మున్సిపాలిటీకి 30 లక్షలు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జిల్లా కేంద్రానికి కూడా రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మిర్యాలగూడకు రూ.5 కోట్లు మిగిలిన మున్సిపాలిటీలకు కూడా రూ.కోటి చొప్పున విడుదల చేస్తామని వెల్లడించారు. మొత్తం కలిపి రూ.186 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి జీవో కూడా రేపే విడుదల చేస్తామని వివరించారు.

తెలంగాణ వచ్చాక వృత్తి కులాలను ఆదుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. యాదవులు, గొల్లకురమలకు గొర్రెలను పంపిణీ చేశామన్నారు. మార్చి తర్వాత మరో విడత గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేపల పంపిణీ చేశామన్నారు. ఇక గ్రామాల్లో కటింగ్ షాపులు నడుపుకునే నాయి బ్రాహ్మణులు.. మోడ్రన్ సెల్లూన్లు పెట్టుకుంటామంటే మార్చి తర్వాత ఒక్కొక్కరికి రూ.లక్ష అందిస్తామన్నారు.