Breaking News :

కృష్ణకాంత్: కెసిఆర్ గారు..పోతిరెడ్డిపాడులో మా వాటా మా హక్కు

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట‌రీ ద్వారా రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌ల‌కు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఏపీ స‌ర్కార్ జారీ చేసిన జీఓ 203పై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చ మొదలైంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కుపై తెలంగాణ ఎందుకు అడ్డుపడుతుంది? అని అక్కడి ప్రజల మనో వేదనను తెలియజేస్తూ కృష్ణకాంత్ మాటల్లో

మన హక్కు మేరకు మన వాటా నీటి తో మన భూభాగంలో కట్టుకుంటున్న ప్రాజెక్టే రాయలసీమ ఎత్తిపోతల – ఇది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యంత్రి వైస్ జగన్ చెప్పిన మాట

కృష్ణా నది నికర జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తూ జూన్‌ 19, 2015న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసారు

TMC = Thousand Million Cubic feet
1TMC = 11,574 cusecs
Cusec = CUbic feet per SECond

ఒక TMC నీళ్లతో ఒక సంవత్సరం పాటు 10 వేల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చు.

బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వెలువడే వరకూ ఇది అమల్లో ఉంటుందని కేంద్రం పేర్కొంది.

మిగులు జలాలను పంపిణీ చేయాలని కృష్ణా బోర్డు కేంద్రాన్ని కోరడంతో అందుకు అనుగుణంగా ఓ ఉన్నత స్థాయి కమిటీని జనవరి 21న కేంద్ర జల్‌ శక్తి శాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బుధవారం మొదటిసారిగా భేటీ అవుతోంది. జూన్‌ 24లోగా కేంద్రానికి ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది.

కృష్ణా డెల్టాకు అవసరమైన మేర నీటిని సరఫరా చేస్తూనే ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి 800 టీఎంసీలకుపైగా వరద జలాలను సముద్రంలోకి వదిలాము. సముద్రంలో కలుస్తున్న వరద జలాలను.. అదీ మన రాష్ట్రానికి కేటాయించిన మేరకు నీటిని కరవు పీడిత ప్రాంతాలకు తరలించడానికి ఒక ప్రాజెక్టు చేపడితే తప్పుపట్టడం సమంజసం కాదు. 

శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉంటేనే ‘పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ (పీహెచ్‌పీ) ద్వారా 7 వేల క్యూసెక్కులు. అదే నీటి మట్టం 841 అడుగులకు చేరితే పీహెచ్‌పీ నుంచి 1000 క్యూసెక్కులు కూడా కాలువకు చేరవు.

శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 881 అడుగుల్లో ఉన్నప్పుడే పీహెచ్‌పీ నుంచి ప్రస్తుతం ఉన్న డిజైన్‌ మేరకు పూర్తి సామర్థ్యం ప్రకారం 44 వేల క్కూసెక్కులను (4 TMC) తరలించవచ్చు. ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదిలో పది రోజులకు మించి ఉండటం మహాకష్టం.

881 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు జలవిద్యుద్పుత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయడం వల్ల నీటి మట్టం తగ్గుపోతుంది. అంటే.. ఆ పది రోజుల్లోనే కరవు పీడిత రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు నీటిని తరలించాల్సి ఉంటుంది.

కొత్తగా కడుతున్న వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా రెండు సొరంగాల(టన్నెల్స్‌) నుంచి వెళ్లేది గరిష్టంగా 9 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే. అది కూడా శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల వద్ద ఉంటేనే ఆ మాత్రం నీళ్లైనా వెళ్తాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైపు ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ఇది.

శ్రీశైలంలో 800 అడుగులు,తక్కువ నీటి మట్టం ఉన్నా తెలంగాణకు 200 టీఎంసీల తరలింపు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ రోజు మానవత్వంతో ఆలోచించడం వల్లే.. తెలంగాణ ప్రాంతంలో ఇదే శ్రీశైలం జలాశయం నుంచి పాలమూరు–రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల నిర్మాణానికి సన్నద్ధత..

కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం ఎడమగట్టు కాలువ) ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తక్కువ నీటి మట్టం ఉన్నప్పుడు కూడా నీళ్లు తరలించుకోగలుగుతున్నారు. అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే దివంగత మహానేత ఆ స్థాయిలో నీటిని ఎత్తిపోయడానికి ప్రాజెక్టులు ప్రారంభించారు’

మరోవైపు తెలంగాణ వైపు ఉన్న ప్రాజెక్టులు చూస్తే.. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో నీళ్లు 800 అడుగుల స్థాయిలో ఉన్నా కూడా రోజుకు 2 టీఎంసీల మేర (23,148 క్యూసెక్కులు) తరలించవచ్చు. ఇలా 90 TMC కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో నీళ్లు 800 అడుగుల స్థాయిలో ఉన్నా రోజుకు 0.3 టీఎంసీల (3,500 క్యూసెక్కుల) నీటిని తీసుకెళ్లగలరు. ఇలా 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు.

శ్రీశైలంలో నీళ్లు 800 అడుగుల స్థాయిలో ఉన్నా దిండి నుంచి రోజుకు 0.5 టీంఎసీలు (5,787 క్యూసెక్కులు) తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్లగలదు. ఇలా 30 టీఎంసీల నీటిని తరలించగలరు.

ఎస్‌ఎల్‌బీసీ ద్వారా అయితే శ్రీశైలంలో 824 అడుగులు నీటిమట్టం ఉన్నప్పుడు రోజుకు సుమారు 0.51 టీఎంసీ (6,000 క్యూసెక్కులు) చొప్పున తెలంగాణ రాష్ట్రం తరలించగలదు. ఇలా 40 టీఎంసీలు తరలించగలరు. ఈ ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి 200 టీఎంసీల నీటిని తీసుకునే సామర్థ్యం తెలంగాణకు ఉంది.వీటికి తోడు జూరాల, భీమ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ల నుంచి కూడా శ్రీశైలం జలాశయంలోకి వరద రాకముందే తెలంగాణా నీళ్లు తీసుకోగలుగుతుంది.

కరవు పీడిత రాయలసీమ దాహార్తి తీర్చవద్దా? ఒకవైపు 800 అడుగులు, ఇతర తక్కువ నీటి మట్టాల స్థాయి నుంచి నీటిని వివిధ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్తుంటే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తనకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి, కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి తాగునీరు ఇవ్వడానికి ఒక సదుపాయం మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఏపీకి పరిమితులు విధించాలనడం ఎంతవరకు సమంజసం? #APGO203isOurRight

ఈ ఆర్టికల్ ని వ్రాసినవారు కృష్ణకాంత్ : ఇది వారి అభిప్రాయం మాత్రమే. ఇందులోని అభిప్రాయాలకు తెలుగు సర్కిల్స్ బాధ్యత వహించదు.

Read Previous

భారతీయ కుటుంబాలలో మూడింట ఒక వంతు మందికి మరో వారంలో వనరులు అయిపోవచ్చు: CMIE సర్వే

Read Next

ఆరోగ్య సేతు : 10 కోట్ల మందిని చేరింది