నా భాజపా మిత్రులను నేను అభినందిస్తున్నాను.
నామీద పెట్టిన ఐటీ, ఈడీ కేసులు పూర్తిగా రాజకీయం.
కార్యకర్తలు సంయమనం పాటించాలి.
కర్ణాటకలో భద్రత కట్టుదిట్టం.
మనీలాండరింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అరెస్టయ్యారు. మంగళవారం రాత్రి 8.35 గంటలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. దర్యాప్తునకు సహకరించని కారణంగానే పీఎంఎల్ఏ కింద అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు తెలిపారు. ఈడీ అధికారులు గత ఐదు రోజులుగా తమ కార్యాలయానికి శివకుమార్‌ను పిలిపించుకుని విచారిస్తున్నారు.
ఇదిలావుండగా ఇటీవల ఈడీ నోటీసుల సమయంలో శివకుమార్ మాట్లాడుతూ.. ‘నేను ఎలాంటి తప్పూ చేయలేదు. కేవలం కక్ష సాధింపుతోనే నన్ను పదేపదే వేధిస్తున్నారు. చట్టానికి సహకరించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. రాత్రికి రాత్రి నోటీసులు ఇచ్చి కాస్త కూడా సమయం ఇవ్వకుండా మర్నాడు మధ్యాహ్నం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి హాజరుకావాలనడం ఏమిటి?’ అని ప్రశ్నించారు.
శివకుమార్ ట్వీట్ చేస్తూ.. ” నా భాజపా మిత్రులను నేను అభినందిస్తున్నాను. నన్ను అరెస్టు చేయించాలన్న భాజపా మిషన్ ఎట్టకేలకు విజయవంతమైంది. నామీద పెట్టిన ఐటీ, ఈడీ కేసులు పూర్తిగా రాజకీయంగా జరిగినవి. నేను భాజపా ప్రతీకార రాజకీయాలకు బలైన బాధితుడిని అని శివకుమార్ ట్వీట్ చేశారు. నా పార్టీ కేడర్ కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఈ కేసు విషయంలో నా తప్పేమీ లేదని త్వరలోనే తేలుతుంది అని మరో ట్వీట్లో పేర్కొన్నారు”.
డీకే శివకుమార్ అరెస్టుతో పలుప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శివకుమార్ అరెస్ట్ రాజకీయ కక్షపూరిత చర్యేనని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్డెక్కిన కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. బెంగళూరు, బళ్లారి, దావణగెరె, శివమొగ్గ, సింథనూరు తదితర ప్రాంతాలతో పాటు, శివకుమార్ అనుచరవర్గం అధికంగా ఉన్న చోట్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమ నేతను బీజేపీ కావాలనే టార్గెట్ చేసిందని మాజీ సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన్ను వెంటనే వదిలేయాలని డిమాండ్ చేశారు.
డీకేశి అరెస్టు నేపథ్యంలో బెంగళూరుతో పాటు మండ్య, హాసన్ తదితర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. గొడవలు జరగకుండా నిఘా వేసింది.