ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి పలువురు సిట్టింగ్‌లు, కీలక నేతలు, మాజీలు బీజేపీ వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.రాజకీయాలలో వలసలు అనేవి సర్వ సాధారణం . పదవుల కోసం అటు నుండి ఇటు ..ఇటు నుండి అటు జంప్ అవుతూ ఉంటారు. తాజాగా విశాఖ జిల్లా అరకు ప్రాంతానికి చెందిన మాజీ వైసిపి నాయకుడు సీవేరి దొన్ను దొర తెలుగుదేశం పార్టీలో చేరారు.
వలసలు టీడీపీ, వైసీపీకే కాదు …ఇప్పుడు జనసేన పార్టీకి కూడా వలసలు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన కీలక నేత పసుపులేటి బాలరాజు వైసీపీలో చేరేందు సిద్దంగా ఉన్నారనె ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు ఒక్క సీటు రావడంతో ఆ పార్టీలో ఉండేదానికంటే అధికారంలో ఉన్న వైసీపీలోకి వెల్లడం మంచిదని బాలరాజు భావిస్తున్నారు.
అనారోగ్యం వల్ల మూడు మాసాలుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బుధవారం నాడు ఆయన చింతపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ నేతలతో సుధీర్ఘంగా చర్చించారు. పార్టీ మారే విషయమై బాలరాజు పరోక్షంగా తన సన్నిహితులు, పార్టీ కార్యకర్తలకు సమాచారం ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలను జగన్ అమల్లోకి తీసుకొచ్చారని బాలరాజు సీఎంను పొగిడారు. మధ్యనిషేధం విధింపు మంచి నిర్ణయమని కొనియాడారు.