బిజెపిని చాలా ప్రమాదకరంగా భావిస్తున్నాం

7

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక విధానంతో నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు తెలిపారు. సిపిఎం కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన గురువారం ఇక్కడి మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల సభ్యులు అక్కడి పరిస్థితులను కేంద్ర కమిటీ సమావేశంలో చర్చకు పెట్టారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక విధానం కారణంగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు.

యువకుల ద్వారా ఇసుక సరఫరా చేస్తామనడంపై అందరితో చర్చించాలని చెప్పారు. నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. మద్యం వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తామని ప్రభుత్వం చెబుతోదనీ, దీనిపై వెంటనే అందరితోనూ, ముఖ్యంగా మహిళా సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి, టిడిపిల మీద, తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ మీద బిజెపి దూకుడుగా విమర్శలు చేస్తూ, తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేస్తున్నా, ఆ మూడు పార్టీలు తగినంత కరుకుగా వ్యవహరించడం లేదని రాఘవులు వ్యాఖ్యానించారు. చాపకింద నీరులా ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘపరివార్‌ శక్తులు మతోన్మాద భావాలు సృష్టించాలని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయని, ఎపి, తెలంగాణలోనూ బిజెపిని చాలా ప్రమాదకరంగా భావిస్తున్నామని తెలిపారు.

కేంద్రంపైన విమర్శలు చేయకుండా ఉంటే ఏదో లబ్ధి ఒనగూరుతుందని జగన్‌, కెసిఆర్‌ పొరబాటుపడుతున్నారని అన్నారు. రాష్ట్రాల హక్కుల్ని కాలరాసి, నిధులను కొల్లగొట్టి కేంద్రం అన్యాయం చేస్తుంటే, ప్రతిఘటించేందుకు యత్నించకుండా, ఏదో న్యాయం చేస్తారని భావించడం తగదని హితవు పలికారు. ఎన్‌ఆర్‌సిని విస్తరిస్తామని బిజెపి ప్రకటించడం ద్వారా దేశానికి నష్టం జరుగుతుందని, ఏపి, తెలంగాణాలకు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. కెసిఆర్‌, జగన్‌ కేంద్ర నేతలను కలిసినప్పుడు వారి అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని, ఆ విషయాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.