కుటుంబ బాధ్యతలు పెరిగేకొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి ఎక్కువయ్యేకొద్దీ నిద్ర దూరంగా వెళ్లిపోతూ ఉంటుంది. అందుకే నిద్రలేమితో బాధపడుతోన్న మహిళల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని తాజాగా ఓ పరిశోధన ద్వారా వెల్లడైంది. పనులన్నీ చక్కబెట్టుకుని ఎప్పటికో మంచం పైకి చేరడం, మళ్లీ ఉదయాన్నే లేచి ఇంట పనులు చేయాలనే ఒత్తిడితో రాత్రిళ్లు ఎంత ఆలస్యంగా పడుకున్నా ఉదయాన్నే నిద్ర లేచిపోవడం వల్ల చాలామంది మహిళలు కంటినిండా నిద్రపోవడం లేదట. ఇక ఉద్యోగం చేసే మహిళలైతే నిద్రలేమి కారణంగా మరింత సమస్యను ఎదుర్కొంటున్నారట. అందుకే నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నారు డాక్టర్లు.

రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే అలసటతో పాటు నీరసం కూడా వచ్చేస్తుందట. దేనిపైనా దృష్టి నిలవదట. కండరాలు, నరాలు బలహీన పడతాయట. జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట. కోపం పెరగడం, విసుగు ఎక్కువ కావడం జరుగుతుందట. ఇవన్నీ హద్దు దాటితే మానసిక రుగ్మతకి, శారీరక అనారోగ్యానికి దారి తీయడం గ్యారంటీ అంటున్నారు డాక్టర్స్. అంతేకాదు… నిద్ర లేమిని నిర్లక్ష్యం చేస్తే కొన్నాళ్లకు పూర్తిగా నిద్ర పట్టని పరిస్థితి కూడా ఏర్పడొచ్చట.

అందుకే నిద్రను అశ్రద్ధ చేయకండి. వీలైనంత త్వరగా పడక మీదకు చేరండి. బెడ్ రూమ్ ని మీకు నచ్చినట్టుగా అలంకరించుకుంటే మనసుకు హాయిగా ఉండి నిద్ర వస్తుంది. రాత్రిళ్లు టీ, కాఫీ లాంటివి తినొద్దు. మసాలా ఫుడ్ కూడా ముట్టుకోవద్దు. త్వరగా భోంచేసి, పడుకునేటప్పటికి అది అరిగిపోయేలా చూసుకోండి. టీవీ చూస్తూ పడుకోవద్దు. సస్పెన్స్ థ్రిల్లర్లు, హారర్ నవలలు చదవొద్దు. చక్కగా స్నానం చేసి, వేడి వేడి పాలు ఓ గ్లాసుడు తాగి నిద్రకు ఉపక్రమించండి. ఈ మంచి అలవాట్లు కంటి మీదకు కునుకుని ఆహ్వానిస్తాయి. అప్పటికీ ఇబ్బందిగా ఉంటే ఓసారి డాక్టర్ ని సంప్రదించండి. అంతేకానీ నిద్రకు మాత్రం దూరంగా ఉండకండి.

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings