దుబ్బాక : బీజేపీ జోరు – జనసేనలో జోష్
Timeline

దుబ్బాక : బీజేపీ జోరు – జనసేనలో జోష్

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలపై రాష్ట్రమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. ఇప్పటికే మొదలైన కౌంటింగ్ లో వచ్చిన ఫలితాలు చూస్తుంటే, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచే అవకాశమే ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందు నుండే బీజేపీ చాలా ఖచ్చితంగా, మేమే గెలవబోతున్నాం అంటూ ప్రచారంలోకి దిగింది. అంతే కాదు పోలింగ్ జరిగిన తరువాత వెలువడిన ఎగ్జిట్ ఫలితాలు కూడా అవే చెప్పాయి . అయితే కొందరు మాత్రం తెరాస గెలుస్తుందని , ఒకవేళ గెలిచినా పెద్ద విజయం అయితే కాదని, అతి తక్కువ ఆధిక్యతతో మాత్రమే గెలుస్తుందనే వాదన వినిపించారు.

అయితే రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటుందేమో అనుకున్న అలోచనను ఎన్నికల ప్రచార స్థాయిలోనే బీజేపీ దెబ్బ కొట్టేసింది . 2019 తెలంగాణ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ అప్పటి నుండే ప్రతిపక్షం మేమే అంటూ తన స్ట్రాటెజితో ముందుకు సాగింది. దుబ్బాక ఫలితాలతో మేమంటే ఏంటో చూపిస్తాం అని, కెసిఆర్ పై ఉన్న వ్యతిరేకత ఈ దెబ్బతో బయట పడిపోతుందని చెప్పుకొచ్చింది. ఇంకా కొద్ది సేపు ఆగితే వారు చెప్పిన దాంట్లో నిజమెంతో తెలుస్తుంది.

ఇక బీజేపీతో చేయి కలిపిన కొత్త పార్టీ జనసేన. మొదట్లో ఈ బంధం కేవలం ఆంధ్ర ప్రదేశ్ కి మాత్రమే పరిమితం అనుకున్నారు అందరు. కానీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిసిన తరువాత క్లారిటీ వచ్చింది. మొన్న దుబ్బాక ఎన్నికలప్పుడే పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేయాల్సి ఉంది కానీ ఎందుకో అది జరగలేదు. అయితే అక్కడ కూడా జనసేన కార్యకర్తలు సైలెంట్ ప్రచారం చేసారని సమాచారం.

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి అయన ఓడిపోవడం కాస్త అభిమానుల్లో నిరాశ మిగిల్చిన, బీజేపీతో పొత్తు కాస్త జోష్ ని నింపింది. ఇది పవన్ చేసిన మంచి రాజకీయ వ్యూహం గా పరిగణించారు అందరు.

ఇప్పుడు బీజేపీ తెలంగాణలో జెండా పాతే క్రమంలో జనసేన శ్రేణుల్లో నూతన ఉత్సాహం పొంగుతుంది. బీజేపీ తెరాస తో చేసే యుద్ధంలో ప్రత్యక్షంగా కానీ సోషల్ మీడియా వేదికగా కానీ తమ వంతు ఉండాల్సిందే అన్నట్టు వ్యూహాలు రచిస్తుంది ఆ పార్టీ. ఇపుడు దుబ్బాక గెలుపు కూడా కెసిఆర్ ని ప్రశించడానికి జనసేనకు మంచి అవకాశంగా భావిస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.