మోడీ కన్నెర్ర చేస్తే కేసీఆర్ జైల్లో ఉంటాడట
Timeline

మోడీ కన్నెర్ర చేస్తే కేసీఆర్ జైల్లో ఉంటాడట

బీజేపీ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అరెస్ట్‌తో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఏబీవీపీ, బీజేవైఎం నాయకులు ఆందోళనలు చేపడుతున్నారు. మరోవైపు కరీంనగర్‌లో ఎంపీ కార్యాలయానికి ఎదురుగా కార్యకర్తలు, నేతలు టెంట్లు వేసి నిరసనకు దిగారు.

బండి సంజయ్ నిరాహార దీక్ష స్థలికి కొద్దిసేపటి క్రితమే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రి బాబు మోహన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బండిని పరామర్శించారు. సుమారు అరగంట పాటు ఎంపీతో తాజాగా జరిగిన విషయాలపై చర్చించారు. అనంతరం మీడియా మీట్ నిర్వహించిన మాజీ మంత్రి బాబు మోహన్.. కేసీఆర్ సర్కార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

దుబ్బాకలో కనీస వసతులు లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు నియోజకవర్గాలు గజ్వేల్, సిద్దిపేట ఎలా ఉన్నాయి..? దుబ్బాక ఎలా ఉంది?. రఘునందన్ మీద కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారు. మామా అల్లుళ్ళ కుట్రలు పని చేయవు. ప్రధాని నరేంద్ర మోదీ కన్నెర్ర చేస్తే కేసీఆర్ జైల్లో ఉంటారు’ అని బాబు మోహన్ జోస్యం చెప్పారు.

మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రభుత్వ తీరును నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతోంది. సీఎం కేసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాలు చేశారు. ఇదిలా ఉంటే.. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇటు అభ్యర్థి రఘునందన్ రావుకు ఫోన్ చేసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీస్తున్నారు.