దుబ్బాక : రేవంత్ రెడ్డి డమ్మీ అయిపోయాడా? బీజేపీ కూడా రానివ్వదా?
Timeline

దుబ్బాక : రేవంత్ రెడ్డి డమ్మీ అయిపోయాడా? బీజేపీ కూడా రానివ్వదా?

తెలంగాణ రాజకీయాలను పెనంమీద వేడి వేడి దోసెలా ఉంచుతూ, వాటి వేడి చల్లార్చకుండా ఎప్పుడూ ఏదో ఒక అంశంతో కెసిఆర్ ని టార్గెట్ చేస్తూ ఉండే ఒకే ఒక్క రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే అని చెప్పొచ్చు. తెలుగు దేశం పార్టీలో తన ప్రస్థానం మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదిగి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత, చంద్రబాబు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ కు మాత్రమే పరిమితం అయిన సమయంలో చేసేదేమి లేక తన ఉనికిని కాపాడుకోడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి తన గళం వినిపించిన విషయం తెలిసిందే.

అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం వరకు కథంతా బాగానే నడిచింది. కానీ ఎప్పుడైతే రేవంత్ వాయిస్ కు ప్రజల్లో ఆదరణ పెరిగిందో కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో గుబులు మొదలయింది. రేవంత్ కు మెల్లి మెల్లిగా సపోర్ట్ తగ్గుతూ వచ్చింది. 2019 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే గా రేవంత్ కొడంగల్ లో ఓడిపోవడానికి కారణం కొందరు కాంగ్రెస్ నాయకుల వెన్నుపోటు అనేది రాజకీయ విశ్లేషకుల మాట.

రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుండి కాంగ్రెస్ కి వచ్చి, రావడం రావడమే కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి పదవికి ఎసరు పెట్టడంతో ఒక్కసారిగా సీనియర్ నాయకులంతా ఒక్కటైపోయారు. రేవంత్ రెడ్డిని ప్రత్యక్షంగానే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఈమధ్య మళ్ళీ అందరు కలిసి బాగానే ఉంటున్నారు. ఉంటున్నారో ఉన్నట్టు నటిస్తున్నారో తెలియదు కానీ వాళ్ళ పార్టీ అంతరంగ గొడవలు ఎటొచ్చీ తెరాస కె లాభం చేస్తున్నాయని గ్రహిచారో ఏమో.

దుబ్బాక ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ నాయకుల్లో ఈసారి జోష్ మాత్రం కనిపించలేదు. దీనికి చాలా కారణాలున్నాయి. రేవంత్ ముందుండి నడిపించడానికి ఇతర సీనియర్ నాయకులు కూడా సహకరించినా సరే ఎందుకో కానీ ఎక్కడ కాంగ్రెస్ మాట వినిపించలేదు. సడెన్ గా బీజేపీ తెరపైకి వచ్చింది. మీడియా కూడా ఫోకస్ అంతా బీజేపీ వైపే పెట్టింది. ఒక్క 10 శాతం కూడా కాంగ్రెస్ ప్రచారాన్ని చూపెట్టిన దాఖలాలు లేవు.ఈరోజు ఫలితాలు కూడా అవే చెప్తున్నాయి.

ఈ దెబ్బతో రేవంత్ రెడ్డి డమ్మీ అయిపోయాడనేది, ఇది కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా రేవంత్ కి పర్సనల్ గా పెద్ద దెబ్బ అనేది వాళ్ళు చెప్తున్న మాట. కాంగ్రెస్ లో రేవంత్ అంటే పడని వాళ్లకు ఇదొక మంచి అవకాశంగా భావించి రేవంత్ ని టార్గెట్ చేయొచ్చు. పీసీసీ పదవి ఇక డౌటే. బీజేపీ లో బండి సంజయ్ రోజు రోజుకీ రేవంత్ స్టైల్ ని కాపీ కొట్టేసి అటు బీజేపీ పార్టీలో , ఇటు ప్రజల్లో దూసుకుపోతున్నారు. కెసిఆర్ ని తిట్టడమే అసలైన రూటని గ్రహించారు బీజేపీ నాయకులు. అలా అయితేనే ప్రజల్లో మైలేజ్ దక్కుతుందనేది వాళ్ళ స్ట్రాటజీ.

మొన్నామధ్య బీజేపీలో చేరడానికి రేవంత్ కి వచ్చినా వెళ్ళలేదు. ఇపుడు వెళ్దామన్నా తలుపులు తెరిచి లేవు. కాంగ్రెస్ నుండి ఇప్పటికే బీజేపీకి వెళ్లిన వాళ్ళు రేవంత్ వస్తే మేము వెళ్ళిపోతాం అనేకాడికి వచ్చిందట. సో ఇంకేం వెళ్తాడు రేవంత్ రెడ్డి. బీజేపీ నాయకులూ కూడా రానిచ్చేలా లేరని సమాచారం. అయన వస్తే మాకు స్క్రీన్ స్పేస్ దక్కదని భయం వాళ్ళది కాబోలు.