హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. పాతబస్తీలోని శాస్త్రీపురం పోలింగ్ బూత్‌లో అసదుద్దీన్ ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు హైదరాబాద్‌లోని ప్రతీ ఓటరు ఇంటి నుంచి బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు కాబట్టి ప్రధానంగా యువత ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అసదుద్దీన్ అప్పుడప్పుడు ఇలా బుల్లెట్ మీద కనిపిస్తూ ఉంటారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు కూడా ఒకటి, రెండు సార్లు బుల్లెట్ బైక్ మీదే ప్రగతిభవన్‌కు వెళ్లారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 150 డివిజన్లకు ఓటింగ్ జరుగుతోంది. అందులో ఎంఐఎం 51 చోట్ల పోటీ చేస్తోంది.