‘కేసీఆర్‌ నుంచి చాలా నేర్చుకున్నా’ – గవర్నర్ నరసింహన్

పెద్దలను గౌరవించడం, కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వం చూపడం నమ్మకం నిలబెట్టుకోవడం సీఎం కేసీఆర్‌లో కనిపించాయని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు.

వీడ్కోలు కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గవర్నర్‌ గుర్తు చేసుకున్నారు. ”ఎప్పుడైనా ఫోన్‌ చేసినప్పుడు సీఎం కేసీఆర్‌కు నమస్కారం చెబితే పెద్దవాళ్లు, చిన్నవాళ్లకు నమస్కారం పెట్టకూడదు అనేవారు. మా అమ్మ చనిపోయినప్పుడు కేసీఆర్‌ కేవలం 15 నిమిషాల్లో నా దగ్గరికి వచ్చారు. అన్నీ నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పారు.

గవర్నర్‌గా వచ్చిన కొత్తలో అన్ని విధాలా సహకరిస్తామని ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడే కేసీఆర్‌ మాటిచ్చారు. అన్న విధంగా మాట నిలబెట్టుకున్నారు. నమ్మకం నిలబెట్టుకున్నారు. మా మధ్య మొదటి నుంచీ ఉన్నది పరస్పర నమ్మకమే. సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన పథకాల్లో మానవత్వం ఉన్నది. నీటిపారుదలశాఖ ప్రాజెక్టులు, మిషన్‌భగీరథ పథకాల్లో కేసీఆర్‌ విజనరీ కనిపించింది. తెలంగాణలో శాంతిభద్రతల పర్యవేక్షణ చాలా గొప్పగా ఉంది.

ప్రతీ స్కీం ఉద్దేశాలను, ప్రయోజనాలను సీఎం కేసీఆర్‌ వివరించేవారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశవ్యాప్తంగా చర్చ అయ్యాయి. సీఎం కేసీఆర్‌ స్వయంగా కంప్యూటర్‌ ఆపరేట్‌ చేసి స్క్రీన్‌పై ప్రాజెక్టుల గురించి వివరించిన వైనాన్ని నేను ప్రధానికి చెప్పాను. సీఎం కేసీఆర్‌కు ప్రజల నాడి తెలుసు. వారి కష్టాలు తెలుసు. సీఎం కేసీఆర్‌తో పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నా.

కేసీఆర్‌ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాకారమవుతుంది. నేను ఎక్కడున్నా సరే.. తెలంగాణ ఫలానా రంగంలో టాప్‌లో ఉందని తెలిస్తే సంతోషిస్తా. తెలంగాణ మొదటి గవర్నర్‌గా నా పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని” నరసింహన్‌ పేర్కొన్నారు. అంతకుముందు ప్రగతిభవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ దంపతులు గవర్నర్‌ దంపతులను సన్మానించారు.