హీరో రానా మేనమామ, టిడిపి నేత వైటీ రాజా మృతి
Timeline

హీరో రానా మేనమామ, టిడిపి నేత వైటీ రాజా మృతి

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత వైటీ రాజా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. కరోనా వైరస్ సోకడంతో అనారోగ్యం పాలైన ఆయన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వైటి రాజా ఆదివారం నాడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.

1999 లో తెలుగు దేశం పార్టీ తరపున తణుకు నుండి గెలుపొంది ప్రాంత ప్రజలకి ఐదేళ్ల పాటు సేవ చేశారు. కాగా వైటీ రాజా సోదరిని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకి ఇచ్చి వివాహం చేశారు. ఆయన మృతి పట్ల తెలుగు దేశం పార్టీ కి చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

వైటీ రాజా పూర్తిపేరు యలమర్తి తిమ్మ రాజా. ఆయన సొంతూరు… గుంటూరు జిల్లా కారంచేడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చెందిన యలమర్తి నారాయణరావు ఆయనను దత్తత తీసుకున్నారు. వై టీ రాజా 1999 నుంచి 2004 వరకు తణుకు ఎమ్మెల్యేగా చేశారు. తణుకు కన్జ్యూమర్స్ కో-ఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి స్వల్ప తేడాతో ఓడారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండటంతో… టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.