తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం నాడు హైకోర్టులో విచారణ కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం దాఖమలు చేసిన కౌంటర్‌పై అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు తమ వాదనలను వినిపించారు.
వార్డుల విభజన , జనాభా నిష్పత్తికి సంబంధించిన లోపాలను సరిచేయడం జరిగిందని ఆయన కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న అంశాలకు, వాస్తవిక స్థితికి పొంతన లేదని పిటిషనర్లు వాదించారు. చిన్న చిన్న లోపాలను బూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.
వార్డుల విభజనలో మార్పులు ఉన్నట్టయితే ఆ పరిధిలోనే ఉంటాయని హైకోర్టు పేర్కొంది. వార్డుల విభజన వల్ల ఓటర్లు పరిధి ఒక జిల్లా నుండి మరో జిల్లాకు మారిపోవని పిటిషనర్లకు చెబుతూనే చిన్న చిన్న లోపాలను సైతం సరిచేసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. బుధవారం నాడు మరో మారు ఇరువర్గాల పూర్తి వాదనలను వింటామని న్యాయమూర్తులు పేర్కొంటూ తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేశారు.