ఆర్టీసీ సమ్మె: హైకోర్టు సీరియస్

9

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఆర్టీసీ సమ్మె పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీకి ఎండిని నియమించాలన్న తమ ఆదేశాల్ని ప్రభుత్వం ఎందుకు ఉల్లంఘించిందంటూ.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనాన్ని వ్యక్తపరిచింది. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ఆర్టీసీని చూసుకుంటున్నారని.. ఆ అధికారికి ఆర్టీసీ పై పూర్తి అవగాహన ఉందని అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తెచ్చారు.

సీనియర్‌ అధికారి ఉన్నప్పుడు 14 రోజులుగా కొనసాగుతున్న సమ్మెను ఎందుకు నివారించలేకపోయారని కోర్టు ప్రశ్నించింది. వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని అడిగింది. సీనియర్‌ అధికారి అయినప్పుడు అతడికి పూర్తిగా ఆర్టీసీ ఎండి పదవి బాధ్యతలను ఎందుకివ్వలేదని ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు కొత్త‌ ఆర్టీసీ ఎండి ని నియమించడం వల్ల సమ్మె పరిష్కారం కాదని వెల్లడించింది. ఎండి ఉంటేనే కార్మికుల అవసరాలు తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి నిధులు మంజూరయ్యేలా చూస్తారని.. ఆ విధంగా చేయకపోవడంతో సమ్మె తీవ్రతరమైందని పేర్కొంది.

సమ్మెను ప్రభుత్వం నిలువరించలేకపోతే.. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది. ప్రజలు శక్తివంతులని.. వారు ప్రభుత్వంపై తిరగబడితే ఎవరూ ఆపలేరని, భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొంది. వాటిలో 20 డిమాండ్లు పూర్తిగా పరిష్కారమయ్యే డిమాండ్లేనని, మరి ప్రభుత్వం ఎందుకు వాటిని పరిష్కరించడంలో చొరవ చూపలేదని కోర్టు అడిగింది. దీనిపై విచారణ ఘాటుగా కొనసాగుతోంది. మొత్తం 45 డిమాండ్లను కోర్టు ముందు చదివారు.