మోడీ ఆఫీసులోకి యంగ్ ఐఏఎస్‌ ఆమ్రపాలి ..

యంగ్ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. తెలంగాణ రాష్ట్రానికి పలు విభాగాల్లో సేవలందించిన యంగ్ ఐఏఎస్​ అధికారిణి ఆమ్రపాలి ఇప్పుడు కేంద్ర స్థాయిలో సేవలందించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శిగా ఆమ్రాపాలిని నియమిస్తూ శనివారం రోజున ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమ్రపాలి కూడా స్థానం దక్కించుకున్నారు . పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27 వరకు కొనసాగనున్నారు.

2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు.

అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.