విజయ్ మాల్యా కోసం బ్రిటన్ తో భారత్ డీలింగ్

బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు బ్రిటన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది.  రూ.11,000 కోట్లకు పైగా రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియంను మోసం చేశారనే ఆరోపణలతో విజయ్ మాల్యాపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.  

 విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి పంపించాలని కోర్టు ఇచ్చిన రూలింగ్‌పై అపీలు చేసుకునేందుకు ఆయనకు అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో ఆయనను భారత దేశానికి అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం కోరింది. 

భారత ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం మాల్యా యునైటెడ్ కింగ్‌డమ్ సుప్రీంకోర్టుకు అపీలు చేసుకోవడానికి పెట్టుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురికావడంతో, ఆయనను భారత దేశానికి రప్పించడానికి తదుపరి చర్యలపై బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

భారత దేశంలోని బ్యాంకులను మోసగించినట్లు నమోదైన ఆరోపణలపై విచారణను ఎదుర్కొనడం కోసం విజయ్ మాల్యాను భారత దేశానికి అప్పగించాలని క్రింది కోర్టు రూలింగ్ ఇచ్చింది. దీనిపై ఆయన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రెండో అత్యున్నత న్యాయస్థానం లండన్ హైకోర్టును ఆశ్రయించారు. 

హైకోర్టు ఆయన అపీలును తోసిపుచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకు అపీలు చేయడానికి కూడా ఆయనకు అవకాశం దక్కకపోవడం సకారాత్మక సంకేతంగా భావిస్తున్నారు.  ఇదిలావుండగా, మాల్యా తాను నూటికి 100 శాతం రుణాలను తిరిగి చెల్లిస్తానని, తనపై కేసును ముగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.